2021లో చాలా దేశాల్లో కరోనా అంతమవుతుంది!

2021లో చాలా దేశాల్లో కరోనా అంతమవుతుంది!

మైక్రోసాఫ్ట్ కో‌‌–ఫౌండర్ బిల్ గేట్స్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి దెబ్బకు లక్షలాది మంది బలయ్యారు. వ్యాక్సిన్‌లు రావడం ఆలస్యమైతే మరింత విధ్వంసం తప్పేలా లేదు. అయితే చాలా దేశాల్లో కరోనా వచ్చే ఏడాదే అంతమవుతుందని మైక్రోసాఫ్ట్ కో‌‌–ఫౌండర్ బిల్ గేట్స్ అంటున్నారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని, 2022కల్లా మహమ్మారి అంతమవుతుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదన్నారు. అమెరికన్ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ కరోనా గురించి పలు విషయాలు చెప్పారు.

సంపన్న దేశాల్లో వచ్చే ఏడాదే వైరస్ అంతమవుతుందని, మిగతా కంట్రీస్‌లో 2022లో కరోనా కథ ముగుస్తుందని గేట్స్ పేర్కొన్నారు. ఇంటర్నేషన్ వ్యాక్సిన్ అలయెన్స్‌లో భాగంగా ఇండియాతోపాటు ఎమర్జింగ్ ఎకనామీ దేశాలకు 100 మిలియన్‌ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించడానికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తోపాటు గావి కంపెనీతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. 2021లోపు డోసులు అందించడానికి గాను గేట్స్ ఫౌండేషన్‌, గావి నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు 150 మిలియన్‌ల ఫండింగ్ అందనుంది.