
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓ వైపు ఈ పరిశోధనలు సాగుతుండగానే.. కరోనా బారినపడిన వాళ్లు ప్రాణాలను నిలబెట్టడానికి ఔషధాల కోసం అన్వేషణ మొదలైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ఫాబి ఫ్లూ పేరుతో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ టాబ్లెట్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా కంపెనీ `కోవిఫర్` పేరుతో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమిడిసివిర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా ఫార్మా సంస్థ గిలియడ్ కంపెనీకి చెందిన ఈ ఇంజెక్షన్ తయారీకి భారత్‌కు చెందిన హెటిరో సహా సిప్లా, మైలాన్ వంటి పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు రైట్స్ తీసుకున్నాయి. ఈ క్రమంలో హెటిరో తన జనరిక్ ఫామ్‌కు కోవిఫర్ అనే పేరు పెట్టి దాన్ని భారత మార్కెట్‌లోకి తెచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందగా.. తాజాగా ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి కూడా ఆమోదం లభించింది. సిప్రెమి పేరుతో యాంటీవైరల్ ఇంజెక్షన్ పౌడర్‌ను 100 ఎంజీ వైరల్‌లో తీసుకుని వస్తోంది. వీలైనంత వేగంగా దీనిని మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లకు ఈ ఇంజెక్షన్‌ను ఐదు రోజుల పాటు ఇస్తే కోలుకుంటున్నారని తమ క్లినికల్ ట్రయల్స్‌లో తేలినట్లు చెప్పింది. తొలి డోస్ 200 ఎంజీ ఇంజెక్షన్ ఇవ్వాలని, ఆ తర్వాత మరో ఐదు రోజులు 100 ఎంజీ చొప్పున ఇవ్వాలని పేర్కొంది. ఇది నరానికి చేసే ఇంజెక్షన్ అని, ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని వాడాలని చెప్పింది. అయితే ఈ ఇంజెక్షన్‌ను ధరను ఇంకా సిప్లా వెల్లడించాల్సి ఉంది.