క‌రోనా టెస్టింగ్ కెపాసిటీ పెంపు: కోటి మందికి ప‌రీక్ష‌లు

క‌రోనా టెస్టింగ్ కెపాసిటీ పెంపు: కోటి మందికి ప‌రీక్ష‌లు

అమెరికాలో క‌రోనా టెస్టింగ్ కెపాసిటీ భారీగా పెంచామ‌ని, ప్ర‌తి రోజు దాదాపు మూడు ల‌క్ష‌ల టెస్టుల వ‌ర‌కు చేయ‌గ‌లుగుతున్నామ‌ని చెప్పారు ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వారంలో దేశ వ్యాప్తంగా కోటి మందికి ప‌రీక్ష‌లు చేసిన మార్క్ దాట‌బోతున్నామ‌ని అన్నారు. వేరే ఏ దేశ‌మూ ఇందులో సగం టెస్టులు కూడా చేయ‌లేద‌ని చెప్పారాయ‌న‌. సోమ‌వారం ఆయ‌న వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ద‌క్షిణ కొరియా, యూకే, ఫ్రాన్స్, జ‌పాన్, స్వీడ‌న్, ఫిన్లాండ్ లాంటి దేశాల ప‌ర్ క్యాపిటా క‌న్నా ఎక్కువ ప్ర‌జ‌ల‌కు త‌మ దేశంలో టెస్టులు చేస్తున్నామ‌న్నారు ట్రంప్. ద‌క్షిణ కొరియా నాలుగు నెలల్లో చేసిన టెస్టుల సంఖ్య‌ను మించి అమెరికాలోని ఒక్క రాష్ట్రంలోనే ఈ మే నెల‌లో చేస్తామ‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు త‌న అడ్మినిస్ట్రేష‌న్ అన్ని ర‌కాల వ‌న‌రుల‌నూ వాడుకుంటోంద‌ని చెప్పారు. ప‌బ్లిక్, ప్రైవేట్, మిల‌ట‌రీ, ఎక‌న‌మిక్, సైంటిఫిక్, ఇండ‌స్ట్రీయ‌ల్ ఇలా ప్ర‌తి రిసోర్స్ ను వినియోగించుకుంటున్న‌ట్లు తెలిపారు. దేశంలో క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతోంద‌ని అన్నారు ట్రంప్. దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించ‌డం, త‌ర‌చూ చేతులు శుభ్రంగా క‌డుక్కోవ‌డం లాంటివి అల‌వాటు చేసుకున్నార‌ని అన్నారు. ఇక ద‌శ‌ల వారీగా అన్ని ఎక‌న‌మిక్ యాక్టివిటీస్ ని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారాయ‌న‌.

క‌రోనాని చైనాలోనే ఆపేయాల్సింది

క‌రోనా వైర‌స్ విల‌యానికి చైనానే కార‌ణ‌మ‌ని మొద‌టి నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ట్రంప్ మ‌రోసారి ఆ దేశం గురించి ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్ర‌జ‌ల‌ను నానా క‌ష్టాలకు గురిచేస్తోంద‌ని, చెరిగిపోని బాధ‌ను క‌లిగిస్తోంద‌ని అన్నారు. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింద‌ని, వైర‌స్ మొద‌లైన చోట‌నే దీనిని క‌ట్ట‌డి చేయాల్సిందంటూ చైనా పేరు చెప్ప‌కుండానే మూలాన్ని ప్ర‌స్తావించారు. దాదాపు 180 దేశాల‌కు పైగా ఈ వైర‌స్ వ్యాపించి, ల‌క్ష‌లాది ప్రాణాల‌ను బ‌లితీసుకుంద‌న్నారు.
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే 42 ల‌క్ష‌ల మందికి సోకిన ఈ వైర‌స్.. దాదాపు 2 ల‌క్ష‌ల 80 వేల మందిని బ‌లితీసుకుంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అగ్ర‌రాజ్య‌మైన అమెరికాలో న‌మోద‌య్యాయి. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 13 ల‌క్ష‌ల 85 వేల మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా.. 81 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.