కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి

అహ్మదాబాద్: కరోనా వైరస్ తో కాంగ్రెస్ సీనియర్ నేత, అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్(67) మృతిచెందారు. ఆయనకు వైరస్ సోకడంతో ఏప్రిల్ 15న సర్దార్ వల్లభాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. ట్రీట్​మెంట్ పొందుతూ ఆదివారం రాత్రి బద్రుద్దీన్ చనిపోయినట్లు మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా సోమవారం మీడియాకు తెలిపారు. ఆయన ఇప్పటికే డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్నారని, హార్ట్ స్టెంట్ ఇంప్లాంట్ కూడా చేయించుకున్నారని ఎస్వీ ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. కరోనా ఎఫెక్టు కారణంగా తిండిలేని పేదలకు సాయం అందించే క్రమంలో బద్రుద్దీన్ వైరస్ బారిన పడినట్లు తెలిసింది.

సంతాపం ప్రకటించిన రాహుల్
కార్పొరేటర్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. బద్రుద్దీన్ నిబద్ధత గల పార్టీ కార్యకర్త అని, తన క్షేమం కన్నా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన నేత అని కొనియాడారు. సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కూడా కార్పొరేటర్ మరణానికి సంతాపం తెలిపారు. కరోనాతో పోరాడుతూ బద్రుద్దీన్ కన్నుమూయడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని గుజరాత్ పార్టీ నేతలు అమిత్ చావ్డా, శక్తిసిన్హా గోహిల్, అర్జున్ సంతాపం తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం ఆదివారం వరకు అహ్మదాబాద్‌లో 2,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 105 మంది మరణించారు. ఈ నెల మొదట్లో అహ్మదాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వైరస్ పాజిటివ్ రావడంతో ఆయన ట్రీట్​మెంట్ పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.