విలీనం అయితయా? : బల్దియాలోకి శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు!

విలీనం అయితయా? : బల్దియాలోకి శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు!
  • విలీనం అయితయా?
  • బల్దియాలోకి శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు!
  • గతంలో ప్రకటించిన బీఆర్​ఎస్ సర్కార్
  • ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం  తీసుకొనే నిర్ణయంపై ఆసక్తి
  • రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా చర్చ 
  • స్థానిక ప్రాంతాల లీడర్లలో ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు : సిటీ శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మెరుగైన పాలన కోసమంటూ 2019లో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు నిర్వహించి మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడింది. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనానికి బ్రేక్ పడే చాన్స్  ఉందనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా నడుస్తోంది. 

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగి వచ్చే జనవరికి నాలుగేళ్లు పూర్తవుతుంది. మరో ఏడాదిలో ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది.  దీంతో  జీహెచ్ఎంసీలో వీలినం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ చేయాల్సి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్​లోని ఆరు జోన్లలో వీటిని కలపాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రేటర్​లో కోటికిపైగా జనాభా ఉంది. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేస్తే దాదాపు రెండు కోట్ల  వరకు జనాభా చేరుకుంటుంది.

మిగులు బడ్జెట్​తో ఉండగా..  

బల్దియాతో పోలిస్తే శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. బల్దియాకు 9 ఏళ్లుగా నయా పైసా ఇవ్వకపోవడంతో అప్పుల పాలైంది. కానీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నులు తదితర వాటి నుంచి వందశాతం కలెక్ట్ అవుతుండటంతో మిగులు బడ్జెట్​తో ఉన్నాయి. స్థానికంగా డెవలప్​మెంట్​కు సంబంధించి ఇబ్బందులు లేవు. అదే బల్దియాలో విలీనం చేస్తే ఈ ఆదాయం అంతా జీహెచ్ఎంసీకే పోతుంది. అయితే, విలీనంపై సర్కార్​దే తుది నిర్ణయం. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడగా ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తి నెలకొంది. విలీనానికి ముందు స్థానిక ప్రజల నుంచి ప్రజాభిప్రాయం తీసుకోవాలని  ఎక్స్​పర్ట్స్ పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై స్థానిక లీడర్లలో ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ ఎంసీలో విలీనం చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామ పంచాయతీలనే.. 

సిటీ శివారులో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట,  బడంగ పేట్, మీర్ పేట్..  7 కార్పొరేషన్లు ఉండగా, దమ్మాయిగూడ, నాగారం,  పోచారం, ఘట్‌‌కేసర్, తూంకుంట,  కొంపల్లి, దుండిగల్, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌‌పూర్,  పోచంపల్లి, ఇబ్రహీంపట్నం, జల్ పల్లి, పెద్ద అంబర్ పేట్, మేడ్చల్ .. 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ 2019కు  ముందు ఇందులో చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలుగా ఉండేవి. 

 ప్రజాభిప్రాయం తీసుకోవాలి

శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బల్దియాలో విలీనం చేస్తే మంచిదే.  కానీ అంతకుముందు స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. బల్దియా జనాభాతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో  రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు ఒక్క పైసా ఇవ్వలేదు. విలీనం చేసిన తర్వాత ఇదే పరిస్థితి ఉంటే అప్పుడు డెవలప్​మెంట్​పై ఎఫెక్ట్ పడుతుంది. ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు కూడా రావడం లేదు.

– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ