సత్యసాయి ఆలోచనలు అందరికీ ఆదర్శం :సింధూ ఆదర్శ్ రెడ్డి

సత్యసాయి ఆలోచనలు అందరికీ ఆదర్శం :సింధూ ఆదర్శ్ రెడ్డి
  • శత జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్​ సింధూ ఆదర్శ్ ​రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: భగవాన్ సత్యసాయి ప్రపంచానికి శాంతిని పంచారని, ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ ​రెడ్డి అన్నారు. ఆదివారం సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా బీహెచ్​ఈఎల్​ టౌన్​షిప్​లోని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సింధు మాట్లాడుతూ పటాన్​చెరు కాలుష్య పీడిత గ్రామాల్లో ఉచిత తాగునీరు అందించి ప్రజల కష్టాలను దూరం చేశారని గుర్తు చేశారు. 

అందరూ సమానమనే భావనను పెంచి, ప్రపంచమంతా శాంతిని పరిచయం చేశారని, బాబా స్థాపించిన విద్యాలయాల నుంచి లక్షలాది మంది ప్రయోజకులు తయారయ్యారన్నారు. అంతకు ముందు ఎల్ఐజీ కాలనీలో జరిగిన అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఆమె అనంతరం విద్యాభారతీ స్కూల్​ యాన్యువల్​ కల్చరల్​ డే కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమాలలో రాచకొండ ఏసీపీ రమేశ్ రావు, విద్యాభారతీ ప్రెసిడెంట్ దామోదర్​ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అవధానులు, యాదగిరి రెడ్డి, శేఖర్​, సత్యసాయి సమితి కన్వీనర్​ రామ్​ గోపాల్, సత్యవతి, ప్రవీణ్ పాల్గొన్నారు. 

సేవాభావాన్ని పెంచిన మహనీయుడు సత్యసాయి

సంగారెడ్డి టౌన్: భక్తి భావంతో పాటు సేవా భావాన్ని పెంపొందించిన మహనీయుడు సత్యసాయి అని అడిషనల్​ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ లో బాబా 100వ జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..సత్యసాయి ఓ వైపు భక్తి భావాన్ని పెంపొందిస్తూ మరోవైపు అనేక రకాల సేవ కార్యక్రమాలు నిర్వహించి కనిపించే దైవంగా గుర్తింపు పొందారన్నారు.

 విద్య, వైద్య పరంగా పసిపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా వందలాది గ్రామాలకు తాగునీటి వసతి కల్పించిన ఘనత సాయిబాబాకు చెందుతుందన్నారు. కార్యక్రమంలో యువజన క్రీడల శాఖ అధికారి కాసిం బేగ్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామాచారి, సత్యసాయి సేవా సమితి సభ్యులు ,కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.