కాలిపోయిన ఫైళ్లలో పంచాయతీ కార్యదర్శుల అవినీతి చిట్టా

కాలిపోయిన ఫైళ్లలో పంచాయతీ కార్యదర్శుల అవినీతి చిట్టా
  • కాలిపోయిన ఫైళ్లలో పంచాయతీ కార్యదర్శుల అవినీతి చిట్టా
  • ముందుకెళ్లని డీపీవో ఆఫీసు నిప్పు కేసు ఎంక్వైరీ
  • నిందితులకు అధికార పార్టీ ముఖ్య నేతల సపోర్ట్
  • ఆధారాలు సేకరించేందుకు వెనకాడుతున్న పోలీసులు

గద్వాల, వెలుగు: డీపీవో ఆఫీస్ కు నిప్పు కేసు ఎంక్వైరీ చాలా స్లోగా జరుగుతోంది. జిల్లా ఆఫీస్​ కాలిపోయి 5 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక చిన్న క్లూ కూడా బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఎవిడెన్స్  తీసుకోకుండా, ఆ తరువాత ఎంక్వైరీ పేరుతో హడావుడి చేసి ఆధారాలు దొరకలేదని చెప్పేందుకే నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీపీవో ఆఫీస్​ నిప్పు వెనక కుట్ర కోణం దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నా  పోలీసులు ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదంటు న్నారు. నిప్పు పెట్టిన నిందితులకు రాజకీయ అండ ఉండడంతోనే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఫైల్స్ మాయం చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టా రనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే లోకల్ బాడీ జిల్లా ఆఫీసర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కొద్ది రోజుల కింద అడిషనల్ కలెక్టర్ ఆఫీస్  దగ్గర ఓ జిల్లా ఆఫీసర్ ను ఇతర ఆఫీసర్లు, అటెండర్లు బయటకు పంపించడం చర్చనీయాంశంగా మారింది. 

ఫైల్స్ మాయం చేసేందుకేనా?

2016లో గట్టు మండలం పంచాయతీలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆడిటర్లు అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. అనంతరం జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీలో 8 మంది పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వారిపై చర్యలు తీసుకునే ఫైల్​ డీపీవో ఆఫీస్​లో పెండింగ్​లో ఉంది. ఈ ఫైల్​ మాయం చేసేందుకే డీపీవో చాంబర్​ను టార్గెట్ చేస్తూ తగలబెట్టారనే వాదన వినిపిస్తోంది. ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో ఓ కార్యదర్శి తన పరిధిని మించి ఇల్లీగల్ గా 17 పర్మిషన్లు ఇచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు నిర్మాణాన్ని ఆపడంతో, ఒకరు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు కూడా తప్పుడు పర్మిషన్  ఇవ్వడం జరిగిందిన చెప్పి ఆ కార్యదర్శిపై సస్పెన్షన్ వెట్టివేశారు. ఉద్యోగంలో చేరేందుకు సదరు సెక్రటరీ పైరవీలు చేసుకుంటుండగా, పాత ఫైలుతో ఫ్యూచర్ లో ఇబ్బందులు రావద్దని నిప్పంటించి ఉంటారని ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఫైల్స్ మాయం చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టారని అంటున్నారు. సీసీ పుటేజీ పరిశీలిస్తే నిప్పు కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. ఈ కేసులో పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉండడంతోనే కేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడిషనల్ కలెక్టర్  ఆఫీస్ దగ్గర ఓ జిల్లా స్థాయి ఆఫీసర్​ను ఆఫీసర్లు, అటెండర్లు బలవంతంగా బయటకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే టైమ్​లో డీపీవో ఆఫీసుకు నిప్పు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమైన ఫైళ్లను మాయం చేసేందుకే కొందరు ఆఫీసర్లు నిప్పు నాటకం ఆడారనే ఆరోపణలున్నాయి. 

రాజకీయ అండ..

డీపీవో ఆఫీస్ కు నిప్పు పెట్టిన వారికి లీడర్లు అండగా నిలవడంతో ఈ కేసులో పోలీసులు ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు నిప్పు పెట్టిన వారికి సహకరిస్తున్నాని అంటున్నారు. సస్పెన్షన్​లో ఉన్న సెక్రటరీ రీ జాయినింగ్ కోసం అధికార పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల కోడ్  కారణంగా ఆర్డర్ లేట్ కావడంతో ఆఫీసర్లపై ఆయన ఫైర్​ అయినట్లు తెలుస్తోంది. సదరు సెక్రటరీ చేసిన తప్పులకు సంబంధించిన ఫైలు కూడా ఈ ఘటనలో కాలి బూడిదైంది.

ఎంక్వైరీ చేస్తున్నాం

డీపీవో ఆఫీస్ కు నిప్పు పెట్టిన కేసును ఎంక్వైరీ చేస్తున్నాం. డీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాం. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తాం. ఈ ఘటన ఇంటి దొంగల పని లాగే కనిపిస్తోంది. త్వరలో కేసును ఛేదిస్తాం.
– రంగస్వామి, డీఎస్పీ, గద్వాల