వందల క్వింటాళ్ల బియ్యం ఎలుకలు, పందికొక్కులు బుక్కినయంట

వందల క్వింటాళ్ల బియ్యం ఎలుకలు, పందికొక్కులు బుక్కినయంట

మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్​స్కూళ్లలో పిల్లలకు వండి పెట్టాల్సిన మిడ్​ డే మీల్స్​రైస్​ను ఎలుకలు, పందికొక్కులు బుక్కినయట! అదీ పది, ఇరవై క్వింటాళ్లు కాదు, ఏకంగా రూ.30లక్షల విలువైన బియ్యాన్ని స్వాహా చేశాయట! వినడానికి వింతగా ఉన్నా, నిజంగా ఇదే జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు ఆఫీసర్లు. పెద్దాఫీసర్లు కన్నెర్రచేయడంతో ఇప్పుడు తప్పును దిద్దుకునే పనిలో పడ్డారు.ప్రభుత్వం నిరుడు లాక్​డౌన్​పెట్టడంతో ఏడాదికి పైగా స్కూళ్లు మూతపడడం తెలిసిందే. దీంతో స్కూళ్లకు సప్లై చేసిన మిడ్ డే మీల్స్​రైస్ అలాగే ఉండిపోయాయి. బియ్యానికి పురుగులు పట్టి ఖరాబు కావడంతో వేలం ద్వారా అమ్మేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మంచిర్యాల జిల్లాలో 2019–-20కి సంబంధించిన 2,337 క్వింటాళ్లు, 2020-–21 బాపతు 667 క్వింటాళ్లు కలిపి మొత్తం 3,004 క్వింటాళ్లను ఈ ఆగస్టు 13న బహిరంగంగా వేలం వేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లా కాగజ్​నగర్​కు చెందిన ఒక బియ్యం వ్యాపారి కిలో రూ.23.5కు వేలంలో దక్కించుకున్నాడు. ఎంఈవో ఆఫీసుల్లో, స్కూళ్లలోని స్టాకును సొంతం చేసుకున్నాడు. అయితే రూ.70 లక్షలు కట్టాల్సి ఉండగా సగం మాత్రమే కట్టినట్టు సమాచారం. మిగతా పైసల కోసం ఆఫీసర్లు అడిగితే తాను ఎంత బియ్యం తీసుకున్నానో అంతకే పైసలు కట్టానని చెప్పడంతో అవాక్కయ్యారు. విద్యా శాఖ పెద్దాఫీసర్లు ఎంఈవోలను పిలిపించి అడిగితే నిల్వలన్నీ వ్యాపారికి అప్పగించామని, ఎంత తరుగు వచ్చిందో తెలియదని చెప్పారు. వ్యాపారికి రూలింగ్​పార్టీ లీడర్ల అండ ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. బియ్యానికి పురుగులు పట్టాయని, ఎలుకలు, పందికొక్కులు తిన్నాయని రిపోర్టు తయారు చేసుకొని కలెక్టర్​దగ్గరికి వెళ్తే ఆమె సీరియసైనట్టు తెలిసింది. ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ ​డైరెక్టరేట్​కు వెళ్లినా నిరాశే ఎదురైందని సమాచారం. చివరికి కాగజ్​నగర్​కు చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించినట్టు తెలిసింది. విషయం ఎటూ తేలకపోవడంతో విద్యా శాఖ పెద్దాఫీసర్ ఇటీవల ఎంఈవోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. దాంతో టీచర్స్​యూనియన్ల లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. ఎంఈవోలను బాధ్యులను చేయడం సరికాదని, వ్యాపారితోనే డబ్బులు కట్టించాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తర్వాత ఏం జరిగిందో కానీ మూన్నాలుగు రోజుల్లో మొత్తం పైసలు చెల్లిస్తానని వ్యాపారి ఒప్పుకున్నట్టు తెలిసింది. బియ్యం అప్పగించినప్పుడే కాంటా వేసి రసీదులు తీసుకుంటే సమస్య వచ్చేది కాదని, ఎంఈవోల నిర్లక్ష్యమే వారి మెడకు చుట్టుకుందని అంటున్నారు. ఎలుకలు, పందికొక్కులు వందల క్వింటాళ్ల బియ్యం తినడం నమ్మశక్యంగా లేదని, ఏదో గోల్​మాల్​ జరిగిందని చెబుతున్నారు.