పత్తి రైతులకు దళారులే దిక్కు

పత్తి రైతులకు దళారులే దిక్కు

చండ్రుగొండ, వెలుగు: మండలంలో పత్తి రైతులు కష్టాలు చెప్పరాకుండా ఉన్నాయి. సర్కారు సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ రేటుకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 54,500 , చండ్రుగొండ మండలంలో 4 వేల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారు. వీటిలో వెయ్యి హెక్టార్లలో ఎకరానికి రూ.20 వేల కౌలు పై కొందరు రైతులు పంట వేశారు. ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. తుపాను ప్రభావంతో పత్తి చేన్లలో ఎదుగుదల లోపించి కాయ కుళ్లు, తెగుళ్లు ఆశించాయి. ప్రస్తుతం చండ్రుగొండ, గుర్రాయిగూడెం, బెండాలపాడు, బాలికుంట, గానుగపాడు, తిప్పనపల్లి,పోకలగూడెం, తుంగారం తదితర గ్రామాల్లో పత్తి తీస్తున్నారు. ఒక్కో కూలీకి రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు ఇస్తున్నారు. అయితే ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి అనుకోగా 15 క్వింటాళ్లు కూడా రావడం లేదు.  
అమ్ముకుందామంటే సెంటర్లేవి? 
ఎన్నో కష్టాల మధ్య చేతికొచ్చిన పంటను మద్దతు ధరకు అమ్ముకుందామంటే సర్కారు సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారుల దగ్గరకు పోవాల్సి వస్తోంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు క్వాలిటీ లేదని మార్కెట్ కంటే తక్కువ రేటుకే కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో క్వింటా పత్తి రూ.7700 ఉండగా రూ.5500 నుంచి రూ.6500 మాత్రమే ఇస్తున్నారు. వర్షాల వల్ల పత్తి నిమ్మెక్కిందని, తీసిన పత్తిని ఆరబెట్టుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. పత్తి నిల్వ ఉంటే రంగు మారి గిట్టుబాటు రేటు రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చండ్రుగొండ లోపి మార్కెట్ గోదాముల్లో సీసీఐ సెంటర్​ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

జూలూరుపాడు వెళ్లి అమ్ముకున్నా
ఈ ఏడాది పది ఎకరాల్లో పత్తి వేశా. మొదటి విడతగా ఆరు క్వింటాళ్ల పత్తి తీశా. సీసీఐ సెంటర్​లేక జూలూరుపాడు మండలానికి వెళ్లి అక్కడ అమ్ముకున్నా. మార్కెట్​లో క్వింటా రూ.7700 ఉంటే క్వాలిటీ లేదని రూ.6500కే కొన్నారు. పత్తి ట్రాన్స్ పోర్ట్​ఖర్చు కలిపి క్వింటాల్​కు రూ.2వేల వరకు నష్టపోయా. చండ్రుగొండ మార్కెట్ గోదాముల్లో కాటన్ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేయాలి.  - సీతారామరెడ్డి, రైతు