- తేమ పేరుతో సీసీఐ సెంటర్ నిర్వాహకులు కొనట్లేదని నిరసన
- రెండు గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు: నల్లగొండ జిల్లాలో పత్తి రైతులు రోడ్డెక్కారు. దీంతో రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. శాలిగౌరారం మండలం మాధారం కలాన్ వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రంలో తేమ పేరిట పత్తిని కొనడంలేదని ఆందోళనకు దిగారు. పత్తిని వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పత్తికి నిప్పు పెట్టారు. నకిరేకల్--– -అర్వపల్లి ప్రాంతాల మధ్య రైతులు బైఠాయించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
మూడు రోజుల కింద పత్తిని సీసీఐ సెంటర్ కు తీసుకొస్తే స్లాట్ బుక్ చేసి టోకెన్లు జారీ చేశారని, తేమ పేరుతో కొనకుండా నిలిపేశారని రైతులు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఇక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమాచారం అందడంతో అధికారులు వెళ్లి రైతులతో చర్చించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తామని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
