
- ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.50 వేలు నష్టపోతున్న రైతులు
గద్వాల, వెలుగు: సీడ్ పత్తి రైతులపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత ఏడాదిలో రైతులు పండించిన పంటకు ఒక్కో ప్యాకెట్ కు రూ.525 నుంచి రూ.550 ఇస్తామని కంపెనీలు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి రైతులతో సాగు చేయించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 60 వేల ఎకరాల వరకు సాగు చేశారు. పంట దిగుబడి వచ్చాక, రైతులు తాము పండించిన సీడ్‌ను ఆర్గనైజర్లు, కంపెనీలకు ఇచ్చేశారు. తీరా డబ్బులు చెల్లించే సమయంలో కంపెనీలు ప్లేటు ఫిరాయిస్తున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం ప్యాకెట్‌కు రూ.550 ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.500 చొప్పున లెక్క కట్టి ఇస్తూ రైతులను ముంచుతున్నారు.
ప్రతి ఏడాది మే నెలలో సీడ్ ఇచ్చిన రైతులకు డబ్బులు ఇచ్చేవారు. కానీ, ఈసారి జులై వచ్చినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అందులోనూ కోత విధించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన ఓ సీడ్ కంపెనీ గద్వాల జిల్లాలో 4 వేల ఎకరాలకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చింది. సదరు కంపెనీ ప్యాకెట్ కు రూ.550 చొప్పున ఇస్తామని చెప్పింది. ఇప్పుడు రూ.500 చొప్పున ఇస్తామంటూ మాట మార్చి రైతులను నిండా ముంచుతోంది.
సీడ్ మెన్ కమిటీ చెప్పినా..
కంపెనీలు డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా రైతులకు డబ్బులు చెల్లించాలని సీడ్ మెన్ కమిటీలో తీర్మానం చేశారు. గతంలో చేసుసుకున్న ఒప్పందం ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించి తీరాల్సిందేనని ఆర్గనైజర్లకు సూచించారు. కానీ, కొందరు ఆర్గనైజర్లు రేట్ తగ్గించి ఇవ్వడంతో రైతులు నష్టపోతున్నారు.
1,200 కోట్ల టర్నోవర్..
జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ బిజినెస్ రూ.1,200 కోట్ల టర్నోవర్ ఉంటుంది. డబ్బులు చెల్లించాల్సిన గడువు దాటి రెండు నెలలు గడుస్తున్నా రైతులకు సగం పేమెంట్ కూడా రాలేదు. ఇంకా రూ.600 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉంది. ఆర్గనైజర్లు, సీడ్ కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుండగా, అధికారులు డబ్బులు ఇప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ఏడాది పండించిన సీడ్ పంటకు సంబంధించిన డబ్బులు రాక, ఈ ఏడాది సాగు చేస్తున్న పంటకు పెట్టుబడి పెట్టలేక పత్తి సీడ్ రైతులు ఇబ్బంది పడుతున్నారు.