పత్తి కొనుగోళ్లపై ఇష్టారాజ్యం

పత్తి కొనుగోళ్లపై ఇష్టారాజ్యం
  • నిర్ణయించిన ధర రూ.7,020
  • రైతులకు చెల్లిస్తున్నది రూ. 6,500
  • బిల్లుల జాప్యం.. దళారులకు వరం

సంగారెడ్డి, వెలుగు : జిల్లాలో పత్తి కొనుగోళ్లు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేస్తే సమయానికి బిల్లులు ఇవ్వడంలేదు. దళారులు మాత్రం వెంటనే బిల్లును ఇస్తామని చెప్పి తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి రైతులు సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 22 జిన్నింగ్ మిల్లుల ద్వారా ఇప్పటివరకు సీసీఐ కేంద్రాల్లో 75,175 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.159.77 కోట్ల చెల్లింపులు పెండింగ్​లోనే ఉన్నాయి.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని  రైతులు తప్పని పరిస్థితుల్లో పండించిన పత్తిని తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు. చాలా చోట్ల ప్రైవేట్ వ్యక్తులు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండానే పత్తి కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే లైసెన్స్ ఒకచోట తీసుకుని మరోచోట కొనుగోళ్లు చేస్తున్నారు.

22 జిన్నింగ్ మిల్లులో..

జిల్లాలోని 22 జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా మొత్తం 24,105 మంది రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేశారు. జోగిపేట పరిధిలోని 4 మిల్లులో 6,242 మంది రైతుల నుంచి 12,684.82 మెట్రిక్ టన్నులు, నారాయణఖేడ్ పరిధిలో 8 మిల్లులో 4,792 మంది రైతుల నుంచి 17,269.39 మెట్రిక్ టన్నులు, సదాశివపేట పరిధిలో 3 మిల్లులో5,249 మంది రైతుల నుంచి 16,009.07 మెట్రిక్ టన్నులు, రాయికోడు పరిధిలో 5 మిల్లులో 6,561 మంది రైతుల నుంచి 24,526.78 మెట్రిక్ టన్నులు, వట్ పల్లి పరిధిలో 2 జిన్నింగ్ మిల్లులో 1,262 మంది రైతుల నుంచి 4,685 మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ జరిగింది.

అయితే గత ఏడాదిలో క్వింటాలు పత్తికి రూ.8,300 మద్దతు ధర నిర్ణయించగా, బహిరంగ మార్కెట్లో అప్పుడు క్వింటాలు ధర రూ.11,500కు కొనుగోలు చేశారు. ఈసారి మద్దతు ధర తగ్గించి రూ.7,020 ప్రకటిస్తే బహిరంగ మార్కెట్లో దళారులు రూ.6,500కు కొంటున్నారు. ఈ రకంగా ప్రతి ఏడాది ధర తగ్గుతూ రావడం.. దానికి అనుగుణంగా బహిరంగ మార్కెట్లో దళారులు కూడా ధరలు తగ్గించి కొనుగోలు చేయడంతో పత్తి రైతులకు శాపంగా మారింది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని పత్తి రైతులు కోరుతున్నారు.

జిల్లాలో పరిస్థితి...

జిల్లా వ్యాప్తంగా 3,57,472 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి తగ్గినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. క్వింటాలు పత్తికి రూ.7,020 ధర నిర్ణయించగా బహిరంగ మార్కెట్లో దళారులు రూ.6,500 మాత్రమే చెల్లిస్తూ స్పాట్ పేమెంట్ ఇస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు రూ.520,66 కోట్ల విలువ గల 75,175 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి రూ.363,69 కోట్లను 16,653 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 7,452 మంది రైతులకు రూ.159.77 కోట్లు చెల్లించాల్సి ఉంది.

వాస్తవానికి పత్తిని కొనుగోలు చేసిన 72 గంటల్లోగా చెల్లింపులు చేయాల్సి ఉండగా15 రోజులైనా వాటి తాలూకు డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. పైగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.7,020  ఇవ్వాల్సి ఉండగా తేమ శాతంలో తేడాలు చూపిస్తూ క్వింటాలుకు రూ.7,005 అంటే 15 రూపాయలు ప్రతి క్వింటాల్ కు కట్ చేసి మిగతా సొమ్ము ఖాతాలో జమ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.