గ్యాస్ సమస్య మొదలైందంటే దాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. హెల్దీగా ఉన్నవాళ్లకు కూడా.. ఎప్పుడో ఒకసారి కడుపులో గ్యాస్ పైకి తన్నుతూ ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు గ్యాస్ పట్టేసి గుండెపోటేమో అన్నంతగా భయపెడుతుంది. దీన్నే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. అసలు ఇది ఎందుకొస్తుంది? దీన్ని ఎలా తగ్గించాలి? అన్న విషయాలు డాక్టర్ దీప్తి మాటల్లో..
యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఒక లైఫ్‌స్టైల్ డిసీజ్. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్(జి.ఇ.ఆర్.డి.) అంటారు. ఇది చాలామందిలో కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్. ప్రపంచంలో సుమారు ఒక బిలియన్ (వంద కోట్లు) మంది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశ జనాభాలో సుమారు 15 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి.
యాసిడ్ రిఫ్లక్స్ అంటే..
మనం తినే ఆహారం గొంతు నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. తిన్న ఆహారం జీర్ణమవ్వాలంటే ఆ యాసిడ్స్ అవసరం. ఈ యాసిడ్స్ రోజుకి సుమారు లీటర్ వరకూ రిలీజ్ అవుతాయి. అయితే రకరకాల కారణాల వల్ల కొన్నిసార్లు ఆ యాసిడ్స్.. రివర్స్‌లో అన్నవాహికలోకి లేదా గొంతులోకి వస్తుంటాయి. దీన్నే మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటాం.
కారణాలివే..
అన్నవాహికకు పొట్టకు మధ్యలో ఒక వాల్వ్ (గొట్టం)ఉంటుంది. దీన్ని లోయర్ ఈసోఫిజియల్ స్పింక్టర్ అంటారు. ఈ వాల్వ్ వదులైనప్పుడు పొట్టలోని యాసిడ్స్ పైకి వస్తాయి. ఈ వాల్వ్ వదులు అవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఒబెసిటీ, ఆల్కహాల్, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం లాంటి కారణాల వల్ల ఈ వాల్వ్ వదులు అవుతుంటుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వాల్వ్ కండరాలు వదులయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. వీటితోపాటు కడుపులో కొంచెం కూడా ఖాళీ లేకుండా ఫుల్‌గా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా తినడం, సిట్రస్ ఫ్రూట్స్, చాక్లెట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ లాంటివి తరచూ తీసుకోవడం వల్ల గ్యాస్ తయారవడం పెరుగుతుంది.
ఆహారాన్ని గబగబా తినటం, మాట్లాడుతూ తినడం వల్ల జీర్ణాశయంలోకి గాలి ఎక్కువగా చేరుకుంటుంది. దీనివల్ల కూడా గ్యాస్ పెరుగుతుంది. స్మోకింగ్ చేయడం వల్ల పొగతో పాటు గాలి కూడా లోపలికి వెళ్తుంది. ఇది గ్యాస్ రిలీజ్‌ను మరింత పెంచుతుంది. వీటితోపాటు ఒత్తిడి, ఆందోళన, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వంటివి కూడా యాసిడ్ రిఫ్లక్స్‌కి కారణం అవుతాయి.
సింప్టమ్స్ ఇలా..
సాధారణంగా యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే, యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతున్న కొద్దీ పొట్టలో మంటగా అనిపిస్తుంది. దాంతో పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది. గ్యాస్ పైకి తన్నుకొస్తూ పొట్టతో పాటు ఛాతి, గొంతులో కూడా మంటగా అనిపిస్తుంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల ఎక్కువగా ఛాతిలో మంటగా అనిపిస్తుంది. దీన్నే హార్ట్ బర్న్ అని కూడా అంటాం. ఛాతి భాగంలో గ్యాస్ పట్టినట్టు అనిపిస్తుంది. త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని సార్లు దగ్గు, గొంతులో గరగర లాంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు.
రిస్క్ ఎప్పుడంటే..
సాధారణంగా వయసుపైబడే కొద్దీ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ఆడామగా అన్న తేడా లేదు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే మింగడానికి ఇబ్బందిగా అనిపిస్తున్నా, మింగేటప్పుడు నొప్పిగా ఉన్నా, ఉన్నట్టుండి బరువు తగ్గుతున్నా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఎక్కువైందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతుంటే.. అన్న వాహిక పూత లేదా అన్న వాహిక మూసుకుపోవడం లాంటివి జరగొచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ కొన్నిసార్లు అన్నవాహిక క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉంది.
లైఫ్‌స్టయిల్ మార్పులతో..
యాసిడ్ రిఫ్లక్స్ వేధిస్తున్నప్పుడు వేగించిన ఫుడ్స్, కాఫీ, చాక్లెట్, రెడ్ మీట్, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవద్దు. సిట్రస్ ఫ్రూట్స్, స్పైసీ ఫుడ్స్, ఉల్లి, వెల్లుల్లి, టొమాటోల్లాంటి వాటికి దూరంగా ఉండాలి.
హడావిడిగా కాకుండా మెల్లగా నమిలి తినాలి. ఒకేసారి ఎక్కువ తినకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినాలి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలి. టైంకు తినాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు మానుకోవాలి. పడుకునేటప్పుడు తలకింద కాస్త ఎత్తుగా ఉండే దిండు పెట్టుకోవాలి.
కడుపు ఉబ్బరం, త్రేన్పులు చాలావరకు వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, విరేచనాలు, మలబద్ధకం, వికారం, వాంతులు, బరువు తగ్గడం, తరచుగా కడుపు నొప్పి, గుండెలో మంట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి. మందులు వాడే ముందు అది గ్యాస్ సమస్యా? కాదా? అని కన్ఫర్మ్ చేసుకుని డాక్టర్ల సలహా మేరకు వాడాలి.
జీఈఆర్‌డీ అనేది లైఫ్‌స్టయిల్ డిసీజ్. అందుకని లైఫ్‌స్టైల్‌లో మార్పులతోనే సమస్య తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ నష్టం జరిగింది అనుకుంటే... సర్జికల్ లేదా ఎండోస్కోపిక్ మేనేజ్‌మెంట్ లాంటి ట్రీట్‌మెంట్స్ చేస్తారు డాక్టర్లు.
