సాగర్‌లో మొదలైన కౌంటింగ్.. లీడ్‌లో టీఆర్ఎస్

సాగర్‌లో మొదలైన కౌంటింగ్.. లీడ్‌లో టీఆర్ఎస్

నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక కౌంటింగ్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కౌంటింగ్‌లో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే మొదటి రౌండు ఫలితాలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. తొలిరౌండులో టీఆర్ఎస్ కు 4,228 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ కు 2,753 ఓట్లు పోలయ్యాయి. దాంతో టీఆర్ఎస్‌కు తొలి రౌండులో 1475 ఓట్ల లీడ్ లభించింది.

అధికార టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ పోటీలో ఉన్నారు. నల్గొండలో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఫలితంపై అన్నీ పార్టీలోనూ టెన్షన్ ఉంది. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఉపఎన్నికలో 86.8 శాతంతో 1,89,782 ఓట్లు పోలయ్యాయి. రెండు హాళ్లలో ఏర్పాటు చేసిన 14 టేబుళ్ల మీద కౌంటింగ్ చేపడుతున్నారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో రౌండులో 7,500 ఓట్లు లెక్కిస్తారు. ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. అనంతరం ఈవీఎం ఓట్లు లెక్కిస్తున్నారు.