నేడే తీర్పు .. 20 నిమిషాలకో రౌండ్​ రిజల్ట్​

నేడే తీర్పు .. 20 నిమిషాలకో రౌండ్​ రిజల్ట్​
  • ఆ తర్వాత 20 నిమిషాలకో రౌండ్​ రిజల్ట్​
  • అద్దగంటకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • కౌంటింగ్​ కోసం రాష్ట్రవ్యాప్తంగా 49 సెంటర్లు ఏర్పాటు 
  • తొలుత భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్​ ఫలితాలు
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలపై పూర్తి క్లారిటీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్​ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్​ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 9.30 నుంచి 10 గంటల మధ్య మొదటి రౌండ్​ ఫలితాలు బయటికి వస్తాయి. అనంతరం 20 నిమిషాలకో రౌండ్​ రిజల్ట్స్​ ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఫలితాలపై దాదాపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తొలుత  భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్​ నియోజకవర్గాల ఫలితాలు​ వస్తాయని ఎన్నికల అధికారులు చెప్పారు. 

అత్యధికంగా జూబ్లీహిల్స్​లో 26 రౌండ్లలో ఫలితాలు రానున్నాయి. అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో, అశ్వారావుపేటలో 14 రౌండ్లలో, చార్మినార్​లో 15 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 2 చొప్పున లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఒకే చోట కౌంటింగ్​ కేంద్రం ఉండగా.. మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్​ కేంద్రాల పరిధిలో144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి ర్యాలీలకు, పటాకులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. 

ఈవీఎంలు మొరాయిస్తే వీవీ ప్యాట్ల లెక్కింపు 

కౌంటింగ్​ సమయంలో ఈవీఎంలు మొరాయియిస్తే.. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. అభ్యర్థుల గుర్తుల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి, వారికి పోలైన స్లిప్పులను అందులో వేస్తారు. ఆ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్ యంత్రంలోని స్లిప్పులు లెక్కబెట్టాలంటే.. దాదాపు గంట పట్టే చాన్స్ ఉంది. అయితే, వీవీప్యాట్‌‌‌‌లు లెక్కించాల్సి వస్తే.. అన్నీ ఒకేసారి ఓపెన్ చేయరు. ఒకదాని తర్వాత మరొకటి తెరుస్తారు. దీనివల్ల ఫలితం ఆలస్యమవుతుంది. అభ్యర్థులకు ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉంటే ర్యాండమ్​గా వీవీప్యాట్లలోని ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవకాశం ఇస్తారు.

ఈవీఎంలో రిజల్ట్​ బటన్​తో ఓట్ల లెక్క

ఈవీఎం యంత్రంలోని రిజల్ట్ విభాగానికి ఒక సీల్ ఉంటుంది. ముందు దాన్ని తొలగిస్తారు. ఈవీఎం బయటి క్యాప్​ను మాత్రమే ఓపెన్ చేస్తారు. లోపలి భాగాన్ని తెరవరు. ఆ తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు. అనంతరం.. లోపల ఒక బటన్ తీరుగా మరో సీల్‌‌‌‌ ఉంటుంది. దాన్ని తొలగిస్తే లోపల రిజల్ట్​ బటన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్​ మీద కనిపిస్తుంది. ఆ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. ఇట్లా.. ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తే.. వాటిపై 14 ఈవీఎంలు ఉంచి, వాటిలోని ఓట్లు లెక్కింపు పూర్తయితే దాన్ని ఒక రౌండ్​గా పరిగణిస్తారు. అనంతరం ఫస్ట్​ రౌండ్​ రిజల్ట్స్​ ప్రకటిస్తారు.  

రెండూ సమాంతరంగా !

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అద్ద గంట తర్వాత అంటే ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ఒకవేళ చివరి రౌండ్ లోపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకపోతే అది పూర్తయిన తర్వాతే చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. 

ఎక్కువ సెగ్మెంట్లలో 14 చొప్పున టేబుళ్లు

119 నియోజకవర్గాల ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం మొత్తం  1,798 టేబుళ్లను ఈసీ ఏర్పాటు చేసింది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 2,417  రౌండ్లలో కౌంటింగ్​ పూర్తి చేస్తారు. దాదాపు చాలా నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు రెడీ చేశారు. 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో 28 చొప్పున, మరో మూడు నియోజకవర్గాల్లో 20 చొప్పున, 8 నియోజకవర్గాల్లో 18 చొప్పున,  4 నియోజకవర్గాల్లో 16 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెక్కింపు కోసం అదనంగా ఇంకో టేబుల్​ కేటాయించారు. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి. 

ఈవీఎంకు సీల్​ ఉందా లేదా.. చూసుకోవాల్సిందే

ఓట్ల లెక్కింపు మొదలు.. రిజల్ట్ అనౌన్స్ వరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్​దే ఉంటుంది. ఈ అధికారి  వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు, పోటీచేసిన అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈవీఎం తెరుస్తున్నప్పుడు.. దాని సీల్ సరిగా ఉందా లేదా? అనేది ఏజెంట్లకు చూపిస్తారు. వారు సరిగ్గానే ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే ఓపెన్ చేస్తారు. ఏదైనా తేడా ఉందని భావిస్తే.. ఎలక్షన్ కమిషన్​కు ఫిర్యాదు చేస్తారు.

 ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద.. సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత.. ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతనే రిజల్ట్ ప్రకటిస్తారు. ఏ రౌండ్​లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అనే వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డు మీద రాస్తారు. ఆ తర్వాతే అనౌన్స్ చేస్తారు. ఇలా జరిగే కౌంటింగ్​ మొత్తం వీడియో తీసి భద్రపరుస్తారు.