
- అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
- భర్త మృతి, ఆఖరి నిమిషంలో పోలీసులకు తెలిపిన భార్య
- హాస్పిటల్లో కొనసాగుతున్న ట్రీట్మెంట్
- కేపీహెచ్బీలో ఘటన
కూకట్పల్లి, వెలుగు: అప్పుల బాధ తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కేపీహెచ్ బీ పరిధిలో జరిగింది. నాలుగు రోజుల నుంచి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ జంట కత్తులతో పొట్టలో పొడుచుకొని, గొంతు, చేతుల మనికట్టుపై కోసుకున్నారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ఆఖరి క్షణంలో పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ఈర్లపాలెంకు చెందిన రామకృష్ణారెడ్డి(45), రమ్యకృష్ణ(40) దంపతులు.
రెండేండ్లుగా కేపీహెచ్బీ కాలనీ ఆరో ఫేజ్లో నివాసం ఉంటున్నారు. రెస్టారెంట్, రియల్ఎస్టేట్తో పాటు రామకృష్ణారెడ్డి పలు వ్యాపారాలు చేస్తున్నాడు. అన్ని వ్యాపారాల్లో భారీ నష్టాలు వచ్చి అప్పులు మిగిలాయి. బంధువులు, స్నేహితుల వద్ద కూడా అప్పులు చేశారు. క్రమంగా అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు బంధువులు చిన్న చూపు చూస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్యాభర్తలు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
నాలుగు రోజుల నుంచి సూసైడ్ప్రయత్నాలు చేస్తున్నారు. కత్తులతో పొడుచుకుని, చేతుల మీద కోసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో శుక్రవారం రామకృష్ణారెడ్డి మృతి చెందాడు. తీవ్ర గాయాలతో బాధ పడుతున్న రమ్యకృష్ణ చివరి క్షణంలో శనివారం ఉదయం 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితికి పడి ఉన్న రమ్యకృష్ణని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.