కారు ఢీకొని దంపతులు మృతి..యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌ వద్ద ఘటన

కారు ఢీకొని దంపతులు మృతి..యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌ వద్ద ఘటన
  • నల్గొండ జిల్లాలో కారు, బైక్‌‌ ఢీకొని ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

యాదాద్రి, వెలుగు : రోడ్డు పక్కన నిల్చున్న దంపతులను కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రాజాపేటకు చెందిన గరిదాసు ప్రశాంత్‌‌ (33), ప్రసూన (32) దంపతులు హైదరాబాద్‌‌లోని బోడుప్పల్‌‌లో ఉంటున్నారు. రాజాపేటలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇంటిని చూసేందుకు ఆదివారం బైక్‌‌పై బయలుదేరారు. బీబీనగర్‌‌ వద్దకు చేరుకోగానే ఫోన్‌‌ మోగడంతో బైక్‌‌ను రోడ్డు పక్కన ఆపి ఫోన్‌‌ మాట్లాడుతున్నారు. ఇదే టైంలో హైదరాబాద్‌‌కు చెందిన బీటెక్‌‌ స్టూడెంట్లు దోనాల భార్గవ్, షణ్ముఖ, శివ అద్దెకు తీసుకున్న కారులో గుట్టకు వెళ్తున్నారు. 

బీబీనగర్‌‌ వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిల్చున్న ప్రశాంత్, ప్రసూనను ఢీకొట్టిన అనంతం డివైడర్‌‌ను ఢీకొట్టింది. ప్రశాంత్‌‌ అక్కడికక్కడే చనిపోగా.. ప్రసూన ఎగిరి పక్కనే ఉన్న చెరువులో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మొదట ప్రశాంత్‌‌ ఒక్కడే చనిపోయాడని భావించినప్పటికీ.. యువతి చెరువులో పడిపోయిందని స్థానికులు చెప్పడంతో అక్కడ వెతికించగా ప్రసూన డెడ్‌‌బాడీ దొరికింది. కారులో శివకు తీవ్ర గాయాలు కాగా, భార్గవ్, షణ్ముఖ స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు బీబీనగర్‌‌ పోలీసులు తెలిపారు.

నకిరేకల్‌‌లో కారును ఢీకొట్టిన బైక్‌‌, ఇద్దరు మృతి

నకిరేకల్ (వెలుగు) : కారును బైక్‌‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా నకిరేకల్‌‌ మండలం నెల్లిబండ శివారులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మిర్యాలగూడెం ఎస్‌‌బీఐలో మేనేజర్‌‌గా పనిచేస్తున్న పోనుగంటి కిరణ్‌‌కుమార్‌‌ భార్య సంధ్యారాణి(36)తో కలిసి కారులో తమ స్వగ్రామమైన వరంగల్‌‌లోని గొర్రెకుంటకు వెళ్తున్నారు. నకిరేకల్‌‌ మండలం నెల్లిబండ శివారులోకి రాగానే కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారాణాసి మహేందర్‌‌ (19) బైక్‌‌పై వచ్చి కారును ఢీకొట్టాడు. 

కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న సంధ్యారాణి అక్కడికక్కడే చనిపోయింది. కిరణ్‌‌కుమార్‌‌, మహేందర్‌‌కు తీవ్ర గాయాలు కావడంతో నల్గొండ హాస్పిటల్‌‌కు తరలించగా.. అక్కడ మహేందర్‌‌ చనిపోయాడు. కిరణ్‌‌కుమార్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నాడు. మహేందర్‌‌ పెద్దనాన్న కోటయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశం తెలిపారు.