వెరైటీ నిరసన: వైన్ షాపు ముందు పెండ్లి చేసుకున్న జంట

వెరైటీ నిరసన: వైన్ షాపు ముందు పెండ్లి చేసుకున్న జంట

కోజికోడ్: కేరళలో ఓ జంట లిక్కర్ షాపును పెండ్లి వేదికగా ఎంచుకుని వెరైటీగా ఆ రాష్ట్ర సర్కారుపై నిరసన వ్యక్తం చేసింది. కోజికోడ్‌లో నేషనల్ హైవేపై ఉన్న ఓ లిక్కర్ షాపు ముందు మంగళవారం ఈ సీన్ కనిపించింది. కరోనా ఆంక్షల్లో భాగంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 50 మందికి మించి గెస్టులను అనుమతించకూడదని నిబంధన విధించడంపై నిరసనగా ఇలాంటి పెళ్లిళ్లు చేస్తామని కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగానే మంగళవారం కోజికోడ్‌లో ప్రమోద్, ధన్య అనే యువతీయువకులకు లిక్కర్ షాపు ముందు పెండ్లి చేశారు. ఈ వధూవరులిద్దరూ కొన్నేండ్లుగా క్యాటరింగ్ బిజినెస్‌లో ఉన్నారు.  ఈ పెండ్లిలో కోజికోడ్ ఎంపీ ఎంకే రాఘవన్ (కాంగ్రెస్) కూడా పాల్గొని, సర్కారు విధానాన్ని తప్పుబట్టారు. ఇలా లిక్కర్ షాపు ముందు వివాహాలను రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నట్టు క్యాటరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. రెండు నెలలుగా ముహుర్తాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఆంక్షల కారణంగా చాలా మంది 20 నుంచి 50 మంది బంధువులతోనే ఫంక్షన్లు చేసుకుంటున్నారని, దీంతో ఎవరూ క్యాటరింగ్ ఆర్డర్లు ఇవ్వడం లేదని, దీని వల్ల చాలా మంది ఉపాధి లేక పస్తులుంటున్నారని చెప్పారు. ఎవరైనా పొరబాటున ఎక్కువ మంది జనంతో ఫంక్షన్ చేస్తుంటే అధికారులు కేసులు పెడుతున్నారని కోజికోడ్ ఆల్ కేరళ క్యాటరర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ ప్రేమ్‌చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ లిక్కర్ షాపులు వద్ద భారీగా జనాలు ఎగబడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీని వల్ల ఎవరికీ సమస్య లేదా అని ఆయన ప్రశ్నించారు. ఫంక్షన్లకు 100 మంది వరకూ పర్మిషన్ ఇవ్వాలని విజయన్ సర్కారును తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.