ఎంపీడీఓ ఆఫీసులో లంచాలు అడుగుతున్నారంటూ నిరసన

ఎంపీడీఓ ఆఫీసులో లంచాలు అడుగుతున్నారంటూ నిరసన

నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు:  ఇంకుడు గుంతల బిల్లులను చెల్లించేందుకు ఎంపీడీఓ ఆఫీసులో సిబ్బంది లంచాలు అడుగుతున్నారంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పాత తండాకు చెందిన ఇస్లావత్ చందు దంపతులు పురుగులమందు డబ్బాలతో నిరసనకు దిగారు. తాము లంచాలు ఇచ్చే స్థితిలో లేమని, తమకు బిల్లులు ఇవ్వకుంటే చావే గతి అంటూ మంగళవారం ఎంపీడీఓ ఆఫీసు ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు.

ఇస్లావత్ చందు రెండేండ్ల కింద తౌర్య తండా గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ చెప్పడంతో 70 ఇంకుడు గుంతలు నిర్మించాడు. దీనికి సొంతంగా రూ.2 లక్షల 50 వేలు ఖర్చు పెట్టాడు. అప్పటినుంచి బిల్లుల కోసం తిరుగుతున్నా ఫలితం లేకుండాపోయింది. లంచం ఇస్తేనే బిల్లు పాస్ అవుతుందని చెప్పడంతో విసుగు చెందిన చందు తన భార్యతో కలిసి నిరసనకు దిగాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. అయితే, చందు తన వద్దకు రాలేదని, అతని సమస్య ఏమిటో చెప్పలేదని ఎంపీడీఓ రోజారాణి అన్నారు. సమస్యను పరిష్కరించి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు.