ఒక డోస్ కొవాగ్జిన్, ఇంకో డోస్ కొవిషీల్డ్ సేఫేనా?: ఐసీఎంఆర్ రిపోర్ట్ 

ఒక డోస్ కొవాగ్జిన్, ఇంకో డోస్ కొవిషీల్డ్ సేఫేనా?: ఐసీఎంఆర్ రిపోర్ట్ 

న్యూఢిల్లీ: రెండు వేర్వేరు వ్యాక్సిన్ల‌ను వేసుకోవ‌డం సేఫేనా? ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు కాకుండా వేర్వేరు టీకాలు తీసుకోవ‌డం వ‌ల్ల కొత్త క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమైనా ఉంటాయా? లేదా ఏమైనా ప్ర‌మాదమా? ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ‌న్నీ స‌మాధానం లేని ప్ర‌శ్న‌లుగా ఉన్నాయి. అయితే తాజాగా ఇండియ‌న్ మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) చేసిన అధ్య‌య‌నంలో ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించాయి. రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవ‌డం సేఫేన‌ని ఐసీఎంఆర్ రిపోర్ట్ వెల్ల‌డించింది. క‌రోనా వ్యాక్సిన్లు ఒక డోస్ కొవాగ్జిన్, మ‌రో డోస్ కొవిషీల్డ్ తీసుకుంటే మ‌రింత ఇమ్యూనిటీ పెరుగుతుంద‌ని త‌మ స్ట‌డీలో ప్రాథ‌మికంగా తేలిన‌ట్లు పేర్కొంది.

కొత్త వేరియంట్ల‌ను ఎదుర్కొవ‌డంలో ప్ల‌స్

మిక్స్‌డ్ వ్యాక్సినేష‌న్‌పై ఐసీఎంఆర్ ఈ ఏడాది మే నెల నుంచి స్ట‌డీ చేస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కొద్ది మంది వలంటీర్ల‌పై ఈ అధ్య‌య‌నం చేప‌ట్టింది. ఫ‌స్ట్ డోస్ కొవాగ్జిన్ ఇచ్చి, ఆ త‌ర్వాత నిర్ణీత గ‌డువులో రెండో డోసు కింద కొవిషీల్డ్ ఇచ్చింది. ఇలా మిక్స్‌డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవ‌రికీ ఎటువంటి స‌మస్య‌లు రాలేద‌ని ఐసీఎంఆర్ తాజాగా సిద్ధం చేసిన ప్రైమ‌రీ రిపోర్ట్‌లో వెల్ల‌డించింది. అంతే కాకుండా కొత్త‌గా పుట్టుకొస్తున్న క‌రోనా వేరియంట్ల‌ను ఎదుర్కొనేందుకు తోడ్ప‌డేలా ఇమ్యూనిటీ మ‌రింత శ‌క్తిమంతంగా పెరుగుతోంద‌ని పేర్కొంది. అలాగే కొన్ని ర‌కాల వ్యాక్సిన్ల షార్టేజీని అధిగ‌మించేదుకు కూడా ఈ విధానం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఐసీఎంఆర్ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. అయితే దీనిపై మ‌రింత‌గా అధ్య‌య‌నం జ‌ర‌గాల్సి ఉంద‌ని సూచించింది. ఇత‌ర కంపెనీల వ్యాక్సిన్ల‌నూ లోతుగా ప‌రిశీలించాల్సి ఉంది. మ‌రోవైపు త‌మిళ‌నాడులోని వేలూర్‌లో ఉన్న క్రిస్టియ‌న్ మెడిక‌ల్ కాలేజ్ (సీఎంసీ) ఇప్ప‌టికే ఈ మిక్స్‌డ్ వ్యాక్సినేష‌న్‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేస్తామ‌ని ముందుకొచ్చింది. ఈ ట్ర‌య‌ల్స్ రిజ‌ల్ట్ తెలిసేందుకు మ‌రి కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. అయితే దీని ఫ‌లితాలు కూడా తెలిస్తే ఇలా రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవ‌డం ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు, న‌ష్టాలు ఏమున్నాయ‌న్న దానిపై మ‌రింత క్లారిటీ రానుంది.