కవర్ స్టోరి: నల్లమలలో అందాల అమరగిరి

కవర్ స్టోరి: నల్లమలలో అందాల అమరగిరి

ఇక్కడ వెహికిల్స్‌‌ నుంచి వచ్చే పొగ, రణగొణ ధ్వనులు ఉండవ్‌‌. కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం  కనిపించదు. ఎటు చూసినా పచ్చని చెట్లు, ప్రకృతికి చీరకట్టినట్లు ఉండే ఎత్తయిన కొండలు, పెద్ద పెద్ద లోయలు, కొండలను చుట్టేసిన కృష్ణమ్మ హొయలు.. ఎటు చూసినా నల్లమల అందాలు. 

అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​. నల్లమల తూర్పు తీరంలో విస్తరించిన అడవి ఒక ఎత్తయితే, ఉత్తర దిక్కున కృష్ణమ్మ తీరంలో వెలసిన దేవాలయాలు మరో ఎత్తు. అడవిలో ట్రెక్కింగ్​, అడవి బిడ్డలతో మాటాముచ్చట, జలపాతాలతో సేదదీర్చే మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం, ఏడాదికోసారి మాత్రమే వెళ్ళగలిగే సలేశ్వరం, లొద్దిమల్లయ్య వంటి ప్రాంతాలు చూడాల్సిందే. 

దేవభూమిగా పేరున్న అమరగిరి అందాలు, సోమశిల పరిసరాలు దేనికవే సాటి. వీకెండ్స్‌‌లో సేదతీరాలంటే హైదరాబాద్​కు 200 కిలో మీటర్ల దూరంలో ఉండే నల్లమల బెస్ట్‌‌ స్పాట్‌‌. ఇక్కడ స్టే చేసేందుకు amrabadtigerreserve.com  వెబ్​సైట్​లో ఆన్​లైన్‌‌లో బుకింగ్ చేసుకోవచ్చు. 

హైదరాబాద్ నుండి హాజీపూర్ మీదుగా  శ్రీశైలం రూట్‌‌లో తూర్పు కనుమలు, నల్లమల కొండల పక్కన వెళ్లే రోడ్డును చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. మన్ననూర్ ఘాట్ రోడ్డు గుండా వనమాలిక ఫారెస్ట్ ఎంక్వైరీ దగ్గరకు చేరుకుంటే ఆన్​లైన్​ బుకింగ్​ చేసుకున్నవాళ్లను ఫారెస్ట్ సిబ్బంది కాటేజీల దగ్గరకు తీసుకెళ్తారు. ఆ కాటేజీల అలంకరణ అడవి మధ్యలో గుడిసెలు, చెట్టు కొమ్మలపై ఉన్నామా అన్న ఫీలింగ్​ కలుగుతుంది.

 ప్రకృతి గురించి...

ఎన్విరాన్​మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్​లో  వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాధాన్యతతో పాటు మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనే అంశాలపై తీసిన డాక్యు మెంటరీ చూపిస్తారు. అక్కడే ఫొటోలు కూడా ఉంటాయి. పక్కనే ఉన్న బయోల్యాబ్​లో వన్యప్రాణుల సంతతి అభివృద్ధి, అటవీశాఖ చేపడుతున్న అంశాల గురించి తెలుసుకోవచ్చు. వన్యప్రాణుల మలం సేకరించి వాటి ఆహారపు అలవాట్లు, జంతువుల ఆరోగ్య పరిస్థితి అంచనా వేసే విధానం గురించి తెలుసుకోవచ్చు. 

 ప్రకృతి గురించి...

మధ్యాహ్నం పూట మన్ననూర్​ నుంచి సఫారి వెహికల్​ బయల్దేరుతుంది. ఒక్కో వెహికల్​లో డ్రైవర్​తో పాటు ఒక చెంచు గైడ్​ ఉంటారు. ఏడుగురు టూరిస్ట్​లను ఎక్కిస్తారు. సఫారీ వెహికల్​లో గుండం దాటి  అడవిలోకి వెళ్తుంటే వన్యప్రాణుల దాహం తీర్చేందుకు మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ వాళ్లు ఏర్పాటు చేసిన ‘సాసర్ ఫీట్స్, సోలార్ కుంటలు, చిన్న చెరువులు’ కనిపిస్తాయి. రాత్రిళ్లు వాటి దగ్గర పెద్దపులులు వస్తాయట! సాయంత్రాలు అడవిలో సఫారీకి వెళ్తే జింకలు, సాంబార్, అడవి పందులు, కుందేళ్ళు, నెమళ్ళు, పక్షులు చూడొచ్చు. అప్పుడప్పుడు పెద్దపులి, చిరుత కూడా కనిపిస్తాయి. 

షికార్ ఘర్ 

పరహాబాద్ గేట్ నుండి అడవిలోకి వెళ్తుంటే నిజాం సేదదీరేందుకు కట్టుకున్న షికార్ ఘర్ కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడది శిథిలమైపోయింది. పరహాబాద్ నుంచి వెళ్లే దారిలో చెంచుపెంట తగులుతుంది. ఆ తరువాత కొంతదూరం వెళ్ళాక కనిపించే లోయ, దానిలోపల ఉండే చిన్న చెరువు... ఈ రెండూ ఆకాశాన్ని తాకాయా అన్నట్లు కనిపిస్తుంది. ఫరహాబాద్ వ్యూ పాయింట్ దగ్గర టూరిస్ట్​లు ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడతారు.

ట్రెక్కింగ్‌‌ చేయొచ్చు

రాత్రిళ్లు కాటేజీ దగ్గర భోజనాలు చేశాక వనమాలిక దగ్గర క్యాంప్ ఫైర్ ఏర్పాటుచేస్తారు. అక్కడ  చెంచుల శైలిలో ఆటపాటలు ఉంటాయి. మరుసటిరోజు ఉదయం 6 గంటలకు ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఉమామహేశ్వరం, ప్రతాపరుద్రుడి కోట... ఈ రెండింటిలో టూరిస్ట్​ల్లో ఎక్కువమంది ఏ ప్రాంతాన్ని సెలక్ట్​ చేసుకుంటే అక్కడికి సఫారీ వెహికల్​లో తీసుకెళ్తారు. 

దక్షిణ అమర్​నాథ్

ఉమామహేశ్వర క్షేత్రాన్ని శ్రీశైల ఉత్తర ద్వారంగా పిలుస్తారు. కొండలపై నుండి జాలువారే నీటిధారలు ఆకట్టుకుంటాయి. పరహాబాద్ వ్యూ పాయింట్ నుండి కొంత దూరం జర్నీ చేస్తే దక్షిణ అమర్​నాథ్​గా పిలిచే సలేశ్వరం లింగమయ్య, జలపాతం, మల్లెలతీర్థం, లొద్ది మల్లయ్య జలపాతం, శ్రీశైలం దారిలో దోమలపెంట దగ్గర్లో ఉన్న ఆక్టోపస్ వ్యూ పాయింట్, కృష్ణా రివర్​లో బోటింగ్, శ్రీశైలం డ్యాం, పవర్ హౌజ్, శివుడి కోసం తపస్సు చేసిన అక్క మహాదేవి గుహలు, దత్త పాదాలు ఉండే కదళీవనం లాంటి ప్రాంతాలు చూడొచ్చు.

నల్లమల ఉత్తరం దిక్కున అడవి మధ్య కొండలు దాటుతూ.. సుడులు తిరుగుతూ ప్రవహించే కృష్ణమ్మ అందాలు చూస్తే ఆ అనుభూతే వేరు. అమరగిరిని స్థానికులు ‘దేవభూమి’గా పిలుస్తారు. నది మధ్యలో చీమల తిప్ప, మల్లయ్య సెల చూడాల్సినవి. కృష్ణా నదిలో మునిగిన లలితా సోమేశ్వర స్వామి ఆలయాల సముదాయాలను సోమశిల ఒడ్డున తిరిగి ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా టూరిజం శాఖ కాటేజీలు, బోటింగ్​ ఉంది. కృష్ణానదిలో ప్రవాహం తగ్గాక ఏర్పడే ఇసుక తిన్నెలు చిన్నపాటి ద్వీపాల్లా మారతాయి. టూరిస్ట్​లు రాత్రిళ్లు ఇక్కడ బస చేయొచ్చు. టూరిజం డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో సోమశిల నుంచి శ్రీశైలం దేవస్థానం వరకు కృష్ణానదిలో క్రూయిజ్​ ఏర్పాటు ఉంది.  

- విరివెంటి ప్రహ్లాద్‌, సైదులు
నాగర్​ కర్నూల్​/అమ్రాబాద్​