కవర్ స్టోరీ.. నువ్వులేక నేనులేను

కవర్ స్టోరీ.. నువ్వులేక నేనులేను

ఒకే తల్లిదండ్రులకు పుట్టిన తోబుట్టువులు.. కలిసి పెరిగిన ఫ్రెండ్స్​... మంచీచెడూ చెప్పే బంధువులు.. వీళ్లలో ఎవరైనా ఒకరు శాశ్వతంగా దూరమయ్యారని తెలిస్తే గుండె విలవిల్లాడుతుంది. మనసును మెలిపెట్టే ఆ బాధను బయటకు చెప్పుకోలేక పడే వేదన మాటల్లో చెప్పలేం. మరి అలాంటిది కొన్నేండ్ల పాటు జీవితాన్ని పంచుకున్న జీవితభాగస్వామి అర్ధాంతరంగా మాయమైపోతే. మరుసటి క్షణం నుండి ఆ మనిషి మనతో ఉండరనే నిజం జీవితాన్ని శూన్యం చేస్తుంది. ఇకపై ఒంటరిగా ఎలా బతకాలి అనే ప్రశ్న కొన్నాళ్ల తరువాత ఎందుకు బతకాలి? అనేవరకు వస్తుంది. భార్య దూరమైన భర్త, భర్త దూరమైన భార్య పరిస్థితి ఒకేలా ఉన్నప్పటికీ... భర్త విషయంలో అది కాస్త ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అంటున్నాయి పరిశోధనలు.


పెండ్లికి ముందు.. పెండ్లి తర్వాత... అన్నట్లు ఉంటుంది చాలామంది జీవితం. చివరి క్షణం వరకు తోడుంటామని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేస్తారు. చిరకాలం కలిసి ఉండాలని ఎన్నో ఆశలతో దాంపత్య జీవిత ప్రయాణాన్ని మొదలుపెడతారు. పిల్లలు, వాళ్ల చదువులు, పెండ్లిళ్లు... ఈ బాధ్యతలన్నీ తీర్చడంలో సగం జీవితం అయిపోతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో సంతోషాలు, బాధలు, బాధ్యతలు, చికాకులు... ఇలా ఎన్నో భావోద్వేగాల్ని దంపతులిద్దరూ పంచుకుంటారు. అలాంటి ప్రయాణంలో ఉన్నట్టుండి ఓ కుదుపు! రేపటి నుంచి తన జీవిత భాగస్వామి కళ్లకు కనపడరు. వాళ్ల మాట వినపడదు. మిగిలిన జీవితం అంతా గతించిన జ్ఞాపకాలతోనే గడపాలి! ఆ చేదు నిజాన్ని అంగీకరించలేక చాలామంది... మరీ ముఖ్యంగా మగవాళ్లు భార్య పోయిన కొద్దికాలానికే లోకాన్ని విడిచిపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? మనిషి ప్రాణం తీసేంత శక్తి బాధకు ఉంటుందా? అంటే అది నిజమే అంటున్నాయి కొన్ని రీసెర్చ్​లు.లైఫ్​ పార్ట్​నర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయేవాళ్లలో మగవాళ్లే ఎక్కువ. దీని వెనక కారణాలు అనేకం అంటున్నారు వాళ్లు. అదే స్త్రీల విషయంలో తీసుకుంటే వాళ్లకు తట్టుకోగలిగే శక్తి ఎక్కడినుంచి వస్తుంది?


సాధారణంగా ఒకరు దూరమైతే ఆ బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్తూనే ఉంటుంది. ఎంత కన్నీరు కార్చినా ఆ బాధ తీర్చలేనిది. అయినా సరే దాన్నుంచి బయట పడక తప్పదు. ఎప్పటిలా జీవితాన్ని కొనసాగించాల్సిందే. కానీ... చాలామంది ఆ పనిచేయలేరు. బాధను మర్చిపోవడానికి చాలా ప్రయత్నిస్తారు. బలవంతంగానైనా మర్చిపోవడానికి చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడాలి అనుకుంటారు. కానీ నోట మాట రాదు. ఏం మాట్లాడాలో తెలియదు. ఆలోచన వేరే దానివైపు మళ్లిద్దామంటే ఏకాగ్రత ఉండదు. మనసులో ఏదో దిగులు. పొట్టలో గుబులు నిరంతరం తొలుస్తూ ఉంటుంది. తిండి సహించదు. ఆలోచనలో నిలకడ ఉండదు. మొఖంలో ఏదో కోల్పోయారన్న లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. ఈ లక్షణాలన్నీ భర్త లేదా భార్యను కోల్పోయిన వాళ్లలో కనిపిస్తాయి. అయితే, ఆ బాధ నుంచి కోలుకోలేక కొందరు కొద్దికాలానికే మరణిస్తుంటారు. వాళ్లలో కూడా మగవాళ్లే ఎక్కువగా ఉన్నారని డానిష్​ రీసెర్చ్ చెప్తోంది.

చెప్పలేక...

మరి ఆడవాళ్లు ఎఫెక్ట్​ అవ్వరా? అంటే... అవుతారు. కానీ చనిపోయేంతగా కాదు. ఎందుకంటే...  ఆడవాళ్లు ఎక్స్‌‌ప్రెసివ్​గా ఉంటారు. మనసులో ఏమున్నా దాచుకోకుండా బయటకు చెప్తారు. మగవాళ్లు అలా కాదు. బాధని సరిగా ఎక్స్​ప్రెస్​ చేయలేరు. తమలో తాము కుంగిపోతారే తప్ప బయటకు చెప్పరు. ఎంత దుఃఖం వచ్చినా మనసులోనే పెట్టుకుంటారు. నార్మల్​గా మాట్లాడ్డానికి కూడా ఇష్టపడరు. దాంతో చుట్టూ ఎంతమంది ఉన్నా సైలంట్​గానే ఉంటారు మగవాళ్లు. దీనివల్ల ... అతిగా ఆలోచించి డిప్రెషన్​లోకి వెళ్లిపోతారు. మనసులో ఉన్న బాధని బయటకు చెప్పుకోలేరు. సరిగా నిద్రపోరు. తిండి తినరు. మనుషులతో కలవడానికి ఆసక్తి చూపించరు. దాంతో కొంత కాలానికి శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఆ తరువాత గుండె పనితీరు మీద భారం పడుతుంది. దాంతో హార్ట్​ ఎటాక్​, మరణాలు సంభవిస్తాయి. అయితే, ఈ స్టడీ చేసింది 65 ఏండ్లు పై బడిన వాళ్ల మీద. కాబట్టి ఇక్కడ చెప్పినదంతా వాళ్లకే వర్తిస్తుంది. 65 ఏండ్లు దాటిన వాళ్లలో భార్య చనిపోతే, భర్త మీద ఆ ఎఫెక్ట్​ చాలా ఎక్కువగా ఉంటుందట.

స్టడీ చెప్పింది ఇదే!

డెన్మార్క్, యూకె, సింగపూర్​లోని రీసెర్చర్లు దాదాపు పది లక్షల మంది డానిష్​ ప్రజలపై ఆరేండ్లు రీసెర్చ్ చేశారు. భార్యాభర్తల్లో ఎవరైనా చనిపోతే.. ఎలా ఎఫెక్ట్ అవుతారనేదానికి రెండు కారణాలు ఉంటాయి. వాటిలో ఒకటి జెండర్. రెండోది వయసు. చిన్న వయసులో పార్ట్​నర్​ని కోల్పోయిన వాళ్లు త్వరగా ఎఫెక్ట్ అవుతారు. స్ట్రెస్ పెరుగుతుంది. అలాంటి వాళ్లు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని కారా డాసెల్ చెప్పారు. ఈయన జెరోంటాలజీ డీన్. 65 నుంచి 69 ఏండ్ల మధ్య వయసున్న వ్యక్తి భార్యను కోల్పోయిన తర్వాతి ఏడాదిలోనే చనిపోయే ఛాన్స్ 70 శాతం ఉందని వాళ్ల రీసెర్చ్​లో తేలింది. అదే భార్య విషయానికొస్తే... అది 27శాతం మాత్రమే. ఎందుకు ఈ తేడా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడానికి డాటా లేదు. 

కానీ, భర్త చనిపోయేంత వరకు తోడుగా ఉండి, అన్ని అవసరాలు తీర్చి, సేవలు చేసిన  భార్య తర్వాత ఏం జరగబోతుంది అనేది గ్రహించగలుగుతుంది. అదే భర్త విషయానికి వస్తే అతను శారీరకంగా, మానసికంగా భార్యపై ఎక్కువగా ఆధారపడతాడు. దానివల్ల భార్య దూరమైనప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాడు. ‘‘నేను, నా కొలీగ్స్ చేసిన ఈ స్టడీలో 65 ఏండ్లు పైబడిన వాళ్లను స్టడీ చేశాం. వాళ్లలో 55 శాతం మంది 73 నుంచి 75 ఏండ్ల వయసున్న ఆడవాళ్లే ఉన్నారు. 75 ఏండ్లు  అంతకంటే ఎక్కువ వయసున్న మగవాళ్లు, ఆడవాళ్లతో పోలిస్తే ఎక్కువగా నష్టపోతారని తేలింది. యువకులు, వృద్ధులు భార్యను కోల్పోయిన ఏడాది లేదా మూడేండ్లకు చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందని తెలిసింది” అంటున్నారు పరిశోధకులు. 
*   *   *
అరిచి చెప్పాలనుకుంటారు

ఒక వృద్ధ జంట... భార్యాభర్త ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉంటాయి. రోజూ ట్యాబ్లెట్స్​ వేసుకోవాలి. ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవాలి. కానీ, ఇక్కడ ఏం జరుగుతుందంటే... భర్త పొద్దున్నే నాలుగ్గంటలకు లేచి, టీ కావాలంటాడు. పైగా నిన్న రాత్రి మిగిలిన పాలతో కాకుండా ఫ్రెష్​ పాలతో టీ పెట్టాలి అంటాడు. అయితే, భార్య  కూడా వయసు పైబడి ఎన్నో అనారోగ్యాలతో ఉంటుంది. కాబట్టి ఆమె అంత పొద్దున్నే లేచే పరిస్థితి ఉండదు. లేచినా ఆ టైంలో ఆమె వెళ్లి ఫ్రెష్​ పాలు ఎక్కడ నుంచి తీసుకొస్తుంది? అందుకని ఆమె ఉదయం ఆరు లేదా ఏడు గంటలకు పెట్టిస్తా అంటుంది. అంత లేట్​గా టీ ఇవ్వడం ఆ భర్తకు నచ్చదు. 

ఆ విషయంలో వాళ్లకు గొడవ వస్తుంది. భార్య పరిస్థితి ఎలా ఉన్నా సరే.. భర్త తనకు కావాల్సిన వాటి గురించే ఆలోచించుకుంటాడు. ఆమె తను అడిగినవన్నీ చేసి పెట్టాలని అనుకుంటాడు. అర్థం చేసుకునే తత్వం ఉండదు. ఇన్నేండ్లుగా ఆమె ఏదైతే చేసిందో అదే ఎప్పటికీ చేయాలి అనుకుంటాడు. అది జరగనప్పుడు తనకు సేవ చేసేందుకు ఇంకొకరు కావాలని అనుకుంటాడు. అంతేకానీ, ‘నా పనులు నేను చేసుకోవాల’ని మాత్రం ఆలోచించలేడు. మగవాళ్లకున్న పెద్ద సమస్య ఏంటంటే... మనసులో ఉన్నది  సరిగా చెప్పడం చేతకాక అరుస్తారు.

నువ్వు లేక ...ఉండలేక..

కొందరు తమ జీవిత భాగస్వామిని కోల్పోయాక ఆ బాధని తట్టుకోలేరు. దాంతో కొన్ని గంటలు లేదా రోజులకు చనిపోయారని వార్తల్లో చూస్తుంటాం. కొందరు ఏడాది తర్వాత పోయారని కూడా చెప్తారు. నిజంగానే మనసులోని బాధ.. మనిషిని చంపేస్తుందా? మనసులో పెయిన్​కి అంత పవర్​ ఉందని డాక్టర్లు చెప్పకనే చెప్తుంటారు. దానికి కారణం.. ఒక జంట ఎప్పుడూ కలిసే ఉంటారు. చిన్న విషయాలకు కూడా ఒకరిపై ఒకరు ఆధారపడుతుంటారు. ఇలాంటప్పుడు ఒక్కసారిగా పార్ట్​నర్​లో ఒకరు దూరమైతే ఆ బాధని వాళ్లు తట్టుకోలేరు. నిజాన్ని ఒప్పుకోలేరు. అలాంటప్పుడు మరొకరు కూడా లోకం విడిచివెళ్తారు. ఉదాహరణకు.. నలభై ఏండ్లు పైబడిన  ఒక జంట. వాళ్లకి ఇద్దరు పిల్లలు. 

భర్తని, పిల్లల్ని ఎలా చూసుకోవాలి? భర్త సంపాదన నెలంతా ఎలా సర్దాలి? ఖర్చు ఎలా తగ్గించాలి? పిల్లలకు కష్టం తెలియకుండా ఎలా పెంచాలి? వంటివన్నీ ఆలోచిస్తుంటుంది భార్య. భర్త కూడా భార్యాపిల్లల్ని వీలైనంత సంతోషంగా ఉంచాలని కష్టపడుతుంటాడు. అలా సాగిపోతున్న వాళ్ల లైఫ్​లో ఉన్నట్టుండి భర్తకు అనారోగ్యం. రోజురోజుకి ఆరోగ్యం పాడవుతుంది. ఎంత ఖర్చు పెట్టినా నయం కావట్లేదు. ఆ బాధతో భార్య కూడా అనారోగ్యం పాలవుతుంది. బీపీ, టెన్షన్ పెరిగిపోతుంది. అయినా సరే ఆయన బాగోగులు చూసుకుంటూ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని కోరుకుంటుంది. కానీ... సడెన్​గా ఒకరోజు భర్త ప్రాణాలు విడుస్తాడు. అప్పటికి అది విని తట్టుకునే శక్తి ఆమెకి ఉండదు. 

వెంటనే కుప్పకూలిపోతుంది. భర్త దూరమయ్యాడనే దుఃఖంతో ఆమెకున్న బీపీ పెరుగుతుంది. షుగర్ లెవల్స్ పడిపోతాయి. తిండి సరిగా తినక నీరసం వస్తుంది. నిద్ర తక్కువ అవుతుంది. ఇవన్నీ కలిసి హార్ట్​ ఎటాక్​కు దారి తీస్తాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే... మనసుని, ఆలోచనల్ని అదుపు చేసుకోగలగాలి. లేదంటే... అది శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చివరికి చావు దరికి చేరుస్తుంది.  

సెల్ఫ్​ నెగ్లిజెన్స్ వల్లే.. 

డెబ్బై లేదా ఎనభై ఏండ్లు దాటిన వాళ్ల బంధం కొన్నేండ్ల నాటిది. అయితే, వాళ్లలో ఒకరు అనారోగ్యంతో హాస్పిటల్​లో చేరి, పది రోజులకు పైనే హాస్పిటల్​లో ఉంటే, మిగిలిన ఇంకొకరు చాలా బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్​కి వెళ్లి చూసేంత వీలు కూడా ఉండదు. అలాంటప్పుడు వాళ్లు సైకలాజికల్​గా స్ట్రెస్​కు గురవుతారు. రోజూ చేసే పనులు సరిగా చేయరు. అప్పటికే వాళ్లకు బీపీ, షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వాళ్లు టైంకి వేసుకోవాల్సిన మెడిసిన్స్ వేసుకోరు. జాగ్రత్తలు ఏవీ పాటించరు. ఒకలాంటి సెల్ఫ్ నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. మాట్లాడటానికి, తినడానికి ఇష్టపడరు. నిద్రపోకుండా అతిగా ఆలోచిస్తుంటారు. ‘ఎందుకు నాకు ఈ బాధ? నేను భరించలేను.  నేనే ముందు చనిపోతే బాగుండు’ అని కోరుకుంటుంటారు. అయితే, ఈ క్రమంలో వాళ్లకు అప్పటికే అనారోగ్య సమస్యలు ఉండడం, వాటిని వాళ్లు పట్టించుకోకపోవడం వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. గుండెపోటుకు దారి తీస్తుంది. 

సాధారణ కారణాలు

అనారోగ్యంతో ఉన్న భార్య లేదా భర్తని చూసుకునే క్రమంలో ఇంకొకరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు. టైంకి వాళ్ల మందులు వేసుకోకుండా, తినకుండా ఉండడం, పార్ట్​నర్​ని కోల్పోయిన తర్వాత బాధలోకి వెళ్లడం వల్ల బాగా ఎఫెక్ట్ అవుతారు. అది శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బరువు తగ్గుతారు. ఇమ్యూనిటీ తగ్గుతుంది. నిద్రలేమి వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. రైస్ యూనివర్సిటీ 2018లో చేసిన రీసెర్చ్​లో జీవిత భాగస్వామిని కోల్పోయాక మిగిలిన వాళ్లు17 శాతం బరువు పెరిగారు. దానివల్ల గుండెపోటు, హార్ట్ స్ట్రోక్​ వంటి ప్రమాదాలకు గురయ్యారు. 

సోషల్​ సపోర్ట్​ లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. వాతావరణ మార్పులు అంటే.. ఎన్నో ఏండ్లుగా ఉంటున్న ఇంటిని వదిలి కొత్త ప్లేస్​కి వెళ్లాల్సి రావడం. ఒకరిని కోల్పోయాక జరిగే లైఫ్ స్టైల్ ఛేంజెస్ బతికున్న వాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. 

‘దుఃఖం నిజంగా హృదయానికి హాని చేస్తుంది’ఈ ప్రభావాన్ని టకొట్సుబొ కార్డియోమయోపతి అని పిలుస్తారు. అంటే ఒత్తిడి వల్ల కలిగే కార్డియోమయోపతి అన్నమాట. అది గుండె కండరాల బలహీనతకు దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితి మహిళలను ప్రభావం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

2014లో చేసిన ఒక స్టడీ ప్రకారం... దంపతులిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే మరొకరు మొదటి మూడు నెలల్లో చనిపోయే ప్రమాదం ఉంది. అలా చనిపోయే ఛాన్స్15శాతం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన వాళ్లలో ఒకరు దూరమైతే డిప్రెషన్​కి వెళ్లే ఛాన్స్​ ఎక్కువ.  సొంత ఇంట్లో ఉండే వాళ్లు ఇంకా ఎక్కువ డిప్రెషన్​కి గురవుతారు. ఎందుకంటే ఆ ఇంటి కోసం వాళ్లిద్దరూ కలిసి ఎంత కష్టపడ్డారో.., బాధ్యతల్ని ఎలా పంచుకున్నారో.. ఒకరికొకరు భుజం తట్టి ఎలా నిలబడ్డారో.. ఇంటి గురించి ఎంత శ్రద్ధ తీసుకుని ఉంటారో అనే అంశాలు వాళ్ల మీద బాగా ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా.. ఆర్ధిక​ విషయాలు చూసుకోవడానికి, ఇంటి మెయింటెనెన్స్ వంటి విషయాల్లో భర్త మీద ఆధారపడి ఉంటారు. అలాంటప్పుడు వాళ్లు దూరమైతే.. ఆందోళనకి గురవుతారు. అకస్మాత్తుగా జీవిత భాగస్వామిని కోల్పోవడంతో ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఫైనాన్షియల్, ఎమోషనల్ సపోర్ట్​ రెండింటినీ కోల్పోతారు. 

ప్రభావం ఇలా..

దంపతులిద్దరూ కలిసి మంచీచెడులతో పాటు ఇంటి పనులు పంచుకుంటారు. కాబట్టి ఒకరు దూరమైనప్పుడు ఆ ఎఫెక్ట్ మరొకరి మీద ఎక్కువగా ఉండటం సహజం. భార్యాభర్తలిద్దరిలో ఒకరు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్లని చూసుకోవడం, ఆ టైంలో ఎక్కువ ఒత్తిడికి లోనవడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. లైఫ్​ పార్ట్​నర్​ని కోల్పోయాక ఆరోగ్య​ అలవాట్లు మారతాయి. అవి మరణానికి దారి తీస్తాయి. మనిషిని కోల్పోయాక, అదే వాతావరణంలో బతకాలంటే కష్టం అవుతుంది. 

దాంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆందోళన, నిద్ర వేళల్లో మార్పులు, జీర్ణ సమస్యలు, శక్తి లేకపోవడం, అనారోగ్యం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, బాధ, అసౌకర్యం, బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి సాధారణంగా జరుగుతాయి. అయితే 2008లో వచ్చిన స్టడీ ప్రకారం.. భార్యను కోల్పోయిన తర్వాత కొన్నాళ్లకే భర్త చనిపోవడానికి గల కారణాలు కొన్ని ప్రత్యేకంగా చెప్పారు. అవేంటంటే... క్రానిక్ అబ్​స్ట్రక్టివ్​ పల్మొనరీ డిసీజ్(సీఓపీడీ ), డయాబెటిస్, యాక్సిడెంట్ లేదా ఫ్రాక్చర్, ఇన్ఫెక్షన్. అలాగే  భర్త చనిపోయిన ఆడవాళ్లకు కొన్ని నెలలకే సీఓపీడీ, కొలన్ క్యాన్సర్, యాక్సిడెంట్స్ లేదా సీరియస్ ఫ్రాక్చర్స్, లంగ్ క్యాన్సర్ వంటి వాటి బారిన పడుతున్నారు.

వాళ్లని అర్థం చేసుకోవాలి

ముఖ్యంగా చాలామంది బాధలో ఉన్నవాళ్లని పలకరించడానికి తటపటాయిస్తుంటారు. ‘బాగున్నావా!’ అంటే బాగోదు. మరి ఏమని పలకరించాలి? ఈ ప్రశ్న వేయొచ్చో లేదో? అని వాళ్లలో వాళ్లే అనుకుని, అసలు పలకరించడమే మానేస్తారు. కానీ... మంచో చెడో అసలు పలకరించకపోవడం వల్ల అవతలి వాళ్లు ‘నాతో ఎవరూ మాట్లాడట్లేదు. నేనేం చేశాను? నేను ఏమని వాళ్లతో మాట్లాడాలి. వాళ్లు మాట్లాడితే బాగుండు’ అని బాధపడతారు. 

కొందరు డిప్రెషన్​లో ఉన్నప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి అలవాటు చేసుకుంటారు. ఇది చాలా ప్రమాదం​. ఒత్తిడిలో అలవాటైన ఆ దురలవాట్లే కొంతకాలానికి వ్యసనంలా మారతాయి. అందుకే ఒకవేళ అలాంటి అలవాట్లు అయితే వాటిని మాన్పించే ప్రయత్నం చేయాలి.

చాలామందికి తమ పార్ట్​నర్​ని కోల్పోయాక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ‘నేను ఇలా చేసి ఉండకూడదు. నా వల్లే ఇలా అయింది. అందరూ నా గురించే అనుకుంటుంటారు. నేను నార్మల్​గా ఉంటే ఏమనుకుంటారో’ అనే అనుమానాలు మనసుని గుచ్చుతుంటాయి. వాటిని వాళ్లు ఫ్యామిలీ మెంబర్స్​తో చెప్పుకోలేరు. ఎవరితో డిస్కస్​ చేయాలో తెలియదు. అలాంటప్పుడు తనతో ఉన్నవాళ్లే మాట్లాడి, వాళ్లకు నచ్చజెప్పాలి. లేదా ప్రొఫెషనల్​ కౌన్సెలింగ్​ సెషన్స్ పెట్టించాలి.  

భర్తను కోల్పోయిన ఆడవాళ్లు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. అలాంటివాళ్లు కూడా కొన్నాళ్లకు బయటకు వచ్చి, అందరిలా ఉండేందుకు ట్రై చేయాలి. భర్త లేడు కదా అని శుభకార్యాలకు వెళ్లకుండా.. అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. రెడీ అయి ఫంక్షన్​కు వెళ్తే చూసేవాళ్లంతా ఏమనుకుంటారో అనే ఆలోచన బుర్రలోకి రానీయొద్దు. వాళ్లేం అనుకుంటారో? వీళ్లేం అంటారో అనేది పట్టించుకోకూడదు. చనిపోయిన వాళ్ల గురించి బతికున్న వాళ్ల లైఫ్​ ఆగిపోకూడదని వాళ్లకు ధైర్యం చెప్పాలి. పరిస్థితులన్నింటినీ దాటుకుని, వాళ్ల జీవితాన్ని కొనసాగించడానికి చుట్టుపక్కల వాళ్లు చేయి అందించాలి. 

పిల్లలకు.. అమ్మతో అటాచ్​మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్లకు నాన్న కంటే అమ్మ గురించి ఎక్కువ తెలుస్తుంది. ఎప్పుడేం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అనేవి వాళ్లకు తెలుసు. దానివల్ల హాస్పిటల్​లో ఉన్నప్పుడు కూడా కేర్​ ఎక్కువ తీసుకుంటారు. అయితే కొందరు పిల్లలకి పెద్దవాళ్లైన పేరెంట్స్ మీద కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ‘మా అమ్మ లేనప్పటి నుంచి బాగా కోప్పడుతున్నారు. ఆయన అంతే.. మారడు’ అంటుంటారు. దానికి కారణం వాళ్లు కూడా పేరెంట్స్ వల్ల ఇబ్బంది పడటమే. అలాగని వాళ్లని వదిలేయలేరు. 

డిప్రెషన్​లో ఉన్నప్పుడు వాళ్లు చాలా కోప్పడతారు. కానీ, తర్వాత ‘నా కోపంతో అందర్నీ బాధపెడుతున్నా’ అని బాధపడతారు. కొందరైతే ‘బతికి కూడా వేస్ట్​’ అనుకునే స్టేజ్​కి వెళ్లిపోతారు. అలాంటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్లే వాళ్లకు నచ్చజెప్పాలి. అది పిల్లలు కావచ్చు.. ఇంకెవరైనా కావచ్చు. ‘మూడ్ బాగాలేనట్లు ఉంది. తర్వాత మాట్లాడదాం లే’ అని సర్ది చెప్పాలి. అంతేకానీ, వాళ్లని అర్థం చేసుకోకుండా మాటకు మాట అనకూడదు. అలా చేస్తే అసలే బాధలో ఉన్న వాళ్లని మరింత బాధపెట్టినవాళ్లవుతారు.  

 మీకు మీరే...

  • చుట్టూ ఉన్నవాళ్లతో రోజూ కాసేపు మాట్లాడాలి. నిన్న ఏం జరిగింది.. ఇవాళ ఏం చేశారు? రేపు ఏం చేస్తారు వంటి మామూలు విషయాలను పంచుకోవాలి. మనసులోని బాధను ఎవరితో షేర్ చేసుకోగలుగుతారో వాళ్లతో రెగ్యులర్​గా మాట్లాడుతుండాలి.
  • సరిగా నిద్ర పోవాలి. పగలు కాకుండా రాత్రిళ్లు నిద్రపోవడానికి ట్రై చేయాలి. నైట్ సైకిల్స్ డిస్టర్బ్ అయితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాత్రి నిద్ర అలవాటు చేసుకోవాలి.
  • వాకింగ్, ఎక్సర్​సైజ్​, గార్డెనింగ్​, బుక్ రీడింగ్ వంటివి చేయాలి. ఇలా చేస్తుంటే... మనసు వేరే ఆలోచనలవైపు మళ్లుతుంది. నెమ్మదిగా గుండెలో భారం తగ్గిపోతుంది. ‘నేను అందరిలా మాట్లాడొచ్చు. నవ్వొచ్చు. తిరగొచ్చు’ అనే ఆశ మొదలవుతుంది. 

ఆడవాళ్లు ఎలా తట్టుకోగలుగుతున్నారు?

కొన్ని జంటల్లో ఆడవాళ్లు ఎక్కువ కాలం బతకడానికి కారణం వాళ్లు సోషలైజ్​గా ఉండటమే. సమాజంతో కలుస్తుంటారు. ఎక్కువగా మాట్లాడుతుంటారు. కమ్యూనికేషన్ వాళ్లలో ఎక్కువ. పనిలో ఏకాగ్రత ఎక్కువ. కాబట్టి వేరే పని మీద దృష్టి పెట్టి, బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తనకంటే తన మీద ఆధారపడిన వాళ్ల గురించి ఆలోచించడంలో బిజీ అయిపోతారు. ఉదాహరణకు పిల్లలు. పిల్లల్ని చదివించి, పెండ్లిళ్లు చేసి, వాళ్ల లైఫ్​ని చక్కదిద్దాలనే ఆలోచనతో ఉంటారు ఎప్పుడూ. అలాగే కొందరు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. ఇలా ఏదో ఒక ఆలోచన వాళ్లని నిద్రపోనివ్వదు. కాబట్టి బాధ పడే తీరిక కూడా వాళ్లకు ఉండదు. 

బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్లలేమని అనుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆడవాళ్లకు మనోధైర్యం ఎక్కువ. మరి బాధ ఉండదా? అంటే.. ఉంటుంది. దాన్ని కన్నీళ్ల రూపంలో బయటకు పంపిస్తారు. గుండె పగిలేలా ఏడుస్తారు. ఆ కన్నీళ్లు కొంతకాలానికి ఇంకిపోతాయి. తను ఏడిస్తే తనవాళ్లు కూడా బాధపడతారు అనే ఆలోచన మొదలవుతుంది. అక్కడి నుంచి తన బాధనే ధైర్యంగా మలుచుకుంటుంది ఆమె. ఎక్కువ కాలం బతకడానికి ఏజ్ గ్యాప్ కూడా ఒక కారణం​. వయసు తేడా వల్ల కూడా ఆడవాళ్లు ఎక్కువ కాలం జీవించి ఉన్నట్లు తేలింది. అలాంటి వాళ్లు ఎనిమిది శాతానికి పైనే ఉన్నారు. అలాగే భార్యను కోల్పోయిన భర్తలు ఆరు శాతం బతికి ఉంటే, భర్తను కోల్పోయిన భార్యలు 10 శాతం ఉన్నారు. యావరేజ్​గా 77 నుంచి 79 ఏండ్ల వరకు జీవించి ఉన్నారు. అయితే వాళ్లు జీవించి ఉండడానికి గల కారణం.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ​ తీసుకోవడం. దానికోసం వాళ్లు మూడేండ్ల పాటు ఎంత ఖర్చు చేశారనేది చూస్తే అర్థమవుతుంది. 

ఎక్కువ మొత్తంలో హెల్త్​ కోసం ఖర్చు చేశారు కాబట్టే వాళ్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. ఇంట్లో, హాస్పిటల్లో, సరైన మందులు వేసుకోవడం, ప్రైమరీ కేర్ తీసుకోవడం వంటివన్నీ అందులో భాగమే. అయితే, అందరికీ ఇలానే ఖర్చు ఉంటుందని చెప్పలేం. ఎక్కువగా 85 ఏండ్లు దాటితే ఆడవాళ్లైనా, మగవాళ్లకైనా ఖర్చు ఒకేలా ఉంటుంది. 65 నుంచి 84 ఏండ్ల మధ్య ఉన్నప్పుడు తమ భార్యలను కోల్పోయిన భర్తలకు రిస్క్ ఎక్కువ. ఎక్కువ కాలం బతికిన వాళ్లలో అయితే, ఈ రిస్క్ తక్కువ ఉంటుంది. 85 ఏండ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న మగవాళ్లలో మాత్రమే చనిపోయే ప్రమాదం తగ్గుతుంది. 

ఇలా చేయాలి

  • డైరెక్ట్​గా లేదా ఆన్​లైన్​లో ప్రొఫెషనల్ కౌన్సెలర్​తో మాట్లాడాలి. అలాగే దగ్గర్లో ఉన్న హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్​లో లేదా ఇంట్లో థెరపీ చేయించుకోవాలి. 
  • సెల్ఫ్​ కేర్​ మీద దృష్టి పెట్టాలి. వంట చేయడం, తినడం వంటి వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. అయినప్పటికీ శరీరానికి కొంత సపోర్ట్ అవసరం. బాగా నిద్ర పోవాలి. టైంకి తినాలి. ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే తగ్గించాలి. ప్రతిరోజు ఎక్సర్​సైజ్ చేయాలి. లైఫ్​ స్టైల్​లో జరిగే మార్పులకు వెల్​కం చెప్పాలి.
  • బిజీగా ఉండేందుకు ట్రై చేయాలి. కొత్త మనుషులతో కలవాలి. ఇంతకుముందు భాగస్వామితో కలిసి గడిపిన టైంని వాళ్లు దూరమైన తర్వాత వేరే వాటికి కేటాయించాలి. ఇంటికి దగ్గర్లోని స్కూల్ లేదా బ్యాంక్​ల్లో వలంటీర్​గా పనిచేయడం వంటి కొత్త అలవాట్లు చేసుకోవాలి. ఓపిక ఉంటే పార్ట్​ టైం జాబ్​ చేయొచ్చు. లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవొచ్చు. 
  • పెట్స్​ పెంచుకోవచ్చు. లైఫ్ పార్ట్​నర్​ దూరమైనప్పుడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ పోగొట్టుకోవాలంటే ఒక పెట్​ని పెంచుకోవచ్చు. లైఫ్​ స్టయిల్, హెల్త్, బడ్జెట్​ సపోర్ట్​ చేస్తే ఈ పనిచేయొచ్చు. 2020లో చేసిన ఓ స్టడీ ప్రకారం ఒంటరితనం, డిప్రెషన్ నుంచి బయటపడేయడంలో పెంపుడు కుక్క లేదా పిల్లి బాగా పనికొస్తాయని తేలింది.
  • సోషల్ సపోర్ట్ అవసరం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​కి దూరంగా ఉండకూడదు. కనీసం ఫోన్​లో అయినా వాళ్లతో టచ్​లో ఉండాలి. బుక్ క్లబ్స్, ఫిట్​నెస్ క్లాస్, లోకల్ కమ్యూనిటీ యాక్టివిటీస్​లో పాల్గొనాలి.
  • ఇవన్నీ ఒక ఎత్తయితే... మనసుకి అయిన చాలా గాయాలను కాలమే నయం చేస్తుందనేది జగమెరిగిన సత్యం. మనుషులు ఒక బాధ నుంచి కొత్త సంతోషాన్ని వెతుక్కోవడానికి కొంత శక్తి కావాలి. దానికి కొంత టైం పడుతుంది. క్లినికల్ సైకాలజిస్ట్​ జార్జ్ ఎ. బొనాన్నొ ‘విషాదం​’ మీద చేసిన స్టడీలో ఆరు నెలల తర్వాత 50 శాతం మంది దీర్ఘకాలం విషాదానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉన్నారు. వాటిలో... ఏడుపు, నిద్రలేమి, దిగులు ఎప్పుడూ వాళ్ల ముఖంలో స్పష్టంగా కనిపించాయి. మొదట బాధపడ్డా, మంచి జ్ఞాపకాలు, పాజిటివ్ ఎమోషన్స్ మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ప్రశాంతత దొరుకుతుంది.
  •  ప్రేమించే వాళ్లని కోల్పోవడం.. వాళ్లని మర్చిపోయి నార్మల్​గా లైఫ్ లీడ్ చేయడం పెద్ద సవాలే. కానీ.. చేసేదేం లేదు. నిజాన్ని ఒప్పుకుని, ముందడుగు వేయడం తప్ప. జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు. మారాల్సింది మనుషులే. ఈ భూమ్మీద కోటాను కోట్ల మంది బతుకుతున్నారు. వాళ్లలో ఎవరి లైఫ్​కీ గ్యారెంటీ లేదు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా బతికినన్నాళ్లూ పోరాడాల్సిందే. ఒంటరిగానైనా సరే బతకాల్సిందే!
  • తిరిగి మామూలు మనిషి అవుతారు

  • ఎవరైనా తమ సొంత మనిషిని కోల్పోయినప్పుడు ఎంతో బాధపడతారు. అప్పుడు వాళ్లని ఓదార్చడం చాలా కష్టం. వాళ్ల కన్నీళ్లను తుడవగలం. కానీ, మనసులోని బాధని తీసేయలేం. ఆ వ్యక్తి మళ్లీ మామూలు మనిషిలా మారడానికి చాలా టైం పడుతుంది. అంతవరకు ఓపికగా వాళ్లతో ఉండాలి. వాళ్లకు తగిన విధంగా సాయం అందించాలి. దైవభక్తి ఉంటే ఆవైపుగా వాళ్లను ఎంకరేజ్​ చేయొచ్చు. కాలం గడుస్తున్నా మార్పు రాకపోతే డాక్టర్​ సలహా తీసుకోవాలి. అలాంటి వాళ్లను తిరిగి మామూలు మనిషిని చేయడానికి కొన్ని మెడిసిన్స్, కౌన్సెలింగ్​ సెషన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవాలి. యావరేజ్​గా చెప్పాలంటే... మినిమమ్ ఆరు సెషన్స్ ఉంటాయి. 
  • మొదటి రెండు సెషన్స్​లో వాళ్లని అబ్జర్వ్ చేస్తాం. సెషన్స్​లో నేర్చుకున్న విషయాన్ని వాళ్లు బయట ఎలా వాడుతున్నారు? వాటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనేది చూసి, వాళ్లతో డిస్కస్ చేస్తాం. కొన్నిసార్లు పర్సన్​ని బట్టి ఈ సెషన్స్ షెడ్యూల్ కూడా పెరగొచ్చు. హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అయ్యాయి అనుకున్నప్పుడు మెడిసిన్ కూడా ఆపేస్తాం. కొన్నిసార్లు మాత్రం లాంగ్​టర్మ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఇలాంటివి ఎదుర్కొని, వాటి నుంచి బయటపడిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తి మైండ్ డైవర్ట్ చేయడానికి ఎంత వరకు ట్రై చేస్తున్నారు? అనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.– 
  • డాక్టర్. హరిణికన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్ 

ఏడాదిలో డిప్రెషన్ నుంచి బయటపడతారా?

భార్యాభర్తల్లో ఎవరు చనిపోయినా ఒక ఏడాది పాటు చాలా బాధ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటారు. ఆ స్టేజ్​ని బెరీవ్​మెంట్​ అంటారు. అంటే.. మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి లేదా జీవిని కోల్పోయినప్పుడు వాళ్లతో ఉండే బంధాన్ని గుర్తుచేసుకుంటూ బాధని అనుభవించడం. ఇందులో దశలు కూడా ఉంటాయి. మొదట్లో షాక్​కి గురవుతారు. తర్వాత నిజాన్ని ఒప్పుకోవడానికి నిరాకరిస్తారు. ‘ఎందుకు దూరం చేశావ’ని.. వాళ్లు నమ్మే దైవం మీద కోపం వస్తుంది. కొంచెం డిప్రెషన్​లోకి వెళ్తారు. అలా కొన్ని రోజులకు పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆ డిప్రెషన్​ నుంచి కోలుకుంటారు.