హెల్త్​ ఇన్సూరెన్స్​ చేసుకునేటోళ్లు.. ఎక్కువైనరు!

హెల్త్​ ఇన్సూరెన్స్​ చేసుకునేటోళ్లు.. ఎక్కువైనరు!

హైదరాబాద్, వెలుగు: కొవిడ్​తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పై సిటిజన్స్​లో  ఇంట్రెస్ట్​పెరిగింది. ప్రస్తుతం 80 శాతం మంది ఏదో ఒకహెల్త్​పాలసీ మస్ట్​గా తీసుకుంటున్నారు. ఏదైనా రోగం వచ్చినంక ఇబ్బంది పడేకంటే ముందుగానే పాలసీ చేయించుకుంటే బెటర్​అనుకుని ఇన్సూరెన్స్​ చేయించుకుంటున్నారు. హెల్త్​కంపెనీల కాంటాక్ట్​నంబర్లను తీసుకొని పాలసీల కోసం కాల్​చేస్తున్నారని కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. కరోనా సోకిన వారు లక్షల్లో బిల్లులు చెల్లించి డిశ్చార్జ్​అయిన తర్వాత ఇంటికి వెళ్లి మస్ట్​గా హెల్త్​ఇన్సూరెన్స్​లను తీసుకుంటున్నారు. కొందరు అడ్మిట్​అయినప్పుడు పక్క పేషెంట్​వద్ద వివరాలు తెలుసుకుని పాలసీలను తీసుకునేవారు ఉంటున్నారు. మొత్తానికి వేలతో అయిపోయే దానికి లక్షలు ఎందుకు ఖర్చు చేసుకోవాలని ఆలోచిస్తు న్నారు. ఫ్యామిలీకి గ్రూప్​గా, సీనియర్ సిటిజన్స్​ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు పాలసీలు చేస్తున్నారు. 

ఆరోగ్యశ్రీపై నమ్మకం లేకనే...
 ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్​హాస్పిటల్స్​లోను ఫ్రీ ట్రీట్ మెంట్​పొందవచ్చని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని జనాలు అంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద వర్తించే రోగాలకు కూడా డబ్బులు చెల్లిస్తేనే ఆస్పత్రుల మేనేజ్​మెంట్లు ట్రీట్ మెంట్​అందిస్తామని చెబుతున్నాయి. చేసేది లేక డబ్బులు కట్టి పేదలు తప్పనిసరిగా ట్రీట్ మెంట్​చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అటానమస్​ఆస్పత్రి అయిన నిమ్స్​లో కూడా డబ్బులు చార్జ్​చేస్తున్నారు. ఏ రోగమైనా వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదని వెంటనే బిల్లు కట్టించుకుంటున్నారు. అడ్మిట్​అయ్యేవారు కొద్దిరోజుల తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్​కు షిఫ్ట్ అవుతున్నారు. డైలీ నలుగురైదుగురు  పేషెంట్లు వేరే హాస్పిటల్స్​కు వెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోతుండగా ఆరోగ్యశ్రీ కార్డులపై డాక్టర్లు ట్రీట్​మెంట్​ అందించడంలేదని తెలిసింది. ఇలా ఆరోగ్యశ్రీ కార్డుపై ఎంతో నమ్మకం పెట్టుకొని హాస్పిటల్స్​కి వెళ్తున్న వారికి ఫ్రీ ట్రీట్ మెంట్​అందకపోతుండగా చేసేదిలేక హెల్త్​ఇన్సూరెన్స్​పాలసీలు తీసుకుంటున్నారు. 

కొవిడ్​ తర్వాత పెరిగిన కస్టమర్లు 
గతంలో మూడేళ్లలో అయ్యే ఇన్సూరెన్స్ పాలసీలు  కరోనా తర్వాత ఒక్క ఏడాదిలోనే డబుల్​ అయ్యాయని హెల్త్​ఇన్సూరెన్స్​కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు​చెబుతున్నారు. చిన్న కంపెనీ నుంచి పేరొందిన సంస్థల పాలసీలు తీసుకుంటున్నారంటున్నారు . కొందరు కరోనాకు కూడా సపరేట్​గా ఇన్సూరెన్స్​ చేయిస్తున్నారు. కొవిడ్​ కోసం రూ. వేయి నుంచి రూ. 10 వేల వరకు ప్రత్యేకమైన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పేరొందిన ఓ ఇన్సూరెన్స్​ కంపెనీలో కరోనాకి ముందు  సిటీలో 12 లక్షల మంది కస్టమర్లు ఉండగా, కరోనా తర్వాత 19 లక్షలకు చేరారు. దాదాపు 50 శాతం పాలసీలు పెరిగిపోయాయి.

అడ్మిట్​ చేసుకొని పట్టించుకోలే..

మా అన్న బ్రెయిన్​ కి సంబంధించిన జబ్బుతో బాధపడుతుండగా నిమ్స్ కి తీసుకొచ్చాం. డాక్టర్లు అడ్మిట్ చేసుకోగా, ఆరోగ్యశ్రీ ఉందని చెబితే వర్తించదని చెప్పారు. మూడు రోజులు దాటినా పెద్దగా పట్టించుకోలేదు. కూకట్ పల్లిలోని ఓ కార్పొరేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లాం. నిమ్స్​తో పాటు మరో ప్రైవేట్​ఆస్పత్రిలో ఇప్పటికే 3 లక్షలు ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే భరోసా వెళ్తే పట్టించుకోలేదు. ఇంటికెళ్లాక ప్రవేటుగానైనా హెల్త్​కార్డు తీసుకుంటా. 
- బి.రాజు,పేషెంట్ బంధువు 

జనాల్లో పెరిగిన అవేర్​నెస్​ 

హెల్త్​ఇన్సూరెన్స్​లను చేయించేందుకు జనం ఫుల్​ఇంట్రెస్ట్​చూపుతున్నారు. అందుబాటులో వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఎవరికి తగిన పాలసీ వారు చేయించుకుంటున్నారు. కరోనా తరువాత హెల్త్​పై పబ్లిక్​  చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో అడ్మిట్​ అయి లక్షలు ఖర్చు చేసుకుంటున్న వారు పాలసీ చేస్తే వేలల్లోనే అయిపోతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బిజినెస్​ కూడా బాగా ఉంది.  - మహేందర్​రెడ్డి, టెరిటరీ మేనేజర్, హైదరాబాద్​ స్టార్​హెల్త్​ ఇన్సూరెన్స్ కంపెనీ

హెల్త్​ కార్డుపై ఇంట్రెస్ట్​చూపిస్తూ..

ప్రస్తుతం హెల్త్​ఇన్సూరెన్స్​చేయించుకునేందుకు జనం ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. గతంలో కస్టమర్ల వద్దకు వెళ్లి ఎంత చెప్పినా ఆలోచించి చూస్తామని చెప్పేవారు. ఇప్పుడు వారే ముందుకొచ్చి పాలసీ తీసుకుంటామని కాంటాక్ట్​అవుతున్నారు. 
- సురేశ్, ఓ హెల్త్​ ఇన్సూరెన్స్​కంపెనీ జేఎస్ఓ