పుంజుకుంటున్న కరోనా రికవరీ రేటు: యాక్టివ్ కేసుల కన్నా 3 లక్షలు అధికం..

పుంజుకుంటున్న కరోనా రికవరీ రేటు: యాక్టివ్ కేసుల కన్నా 3 లక్షలు అధికం..

కరోనా వైరస్ బారినపడుతున్న పేషెంట్ల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 10,38,716 మంది కరోనా బారినపడగా.. 26,273 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అయితే ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత 6,53,751 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 63 శాతానికి చేరిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనాతో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 3,58,692గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య యాక్టివ్ కేసుల కన్నా దాదాపు మూడు లక్షలు అధికంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు మెరుగుగా ఉండడం శుభపరిణామమని కేంద్రం పేర్కొంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెస్టింగ్ సామర్థ్యం భారీగా పెంచినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం రోజూ మూడు లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3.61 లక్షల శాంపిల్స్ టెస్ట్ చేశామని, దీంతో ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య కోటీ 34 లక్షలు దాటిందని పేర్కొంది.