కరోనా వల్ల 8 కోట్ల మంది పేదరికంలోకి

కరోనా వల్ల 8 కోట్ల మంది పేదరికంలోకి

మనీలా: కరోనా వల్ల పేదరికంలో కూరుకుపోతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని ఆసియా డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బ్యాంకు (ఏడీబీ)ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి దెబ్బకు 2020లో ఆసియా, పసిఫిక్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో దాదాపు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోయారని చెప్పింది. మంగళవారం విడుదల చేసిన ‘కీ ఇండికేటర్స్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ ఆసియా పసిఫిక్‌‌‌‌‌‌‌‌ 2021’ రిపోర్టులో ఏడీబీ ఈ వివరాలు వెల్లడించింది. 49 సభ్య దేశాల ఆర్థిక, సామాజిక, వాణిజ్య, పర్యావరణ వివరాలను రిపోర్టులో వివరించింది. కరోనా వల్ల పేదరికం, అసమానతలు పెరిగాయని బ్యాంకు చెప్పింది. బతికేందుకు రోజుకు రూ. 140 కూడా ఖర్చు పెట్టలేని పేదవాళ్లు పెరిగారంది. ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో అభివృద్ధి ఆగిపోయిందని వివరించింది. ఆర్థిక వ్యవస్థ తలకిందులై సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైనా(ఎస్డీజీ) కరోనా ప్రభావం పడిందని చెప్పింది. 

కరోనా రాకుంటే..

2017 నాటికి ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో 20 కోట్ల మంది తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడుతున్నారని, కరోనా రాకపోయుంటే 2020కి ఆ సంఖ్య సగానికి తగ్గేదని ఏడీబీ చెప్పింది. కొన్నేళ్లుగా ఆసియా, పసిఫిక్‌‌‌‌‌‌‌‌ దేశాలు మంచి పురోగతి సాధిస్తూ వచ్చాయని.. అయితే ఆ అభివృద్ధిలోని సామాజిక, ఆర్థిక లోపాలను కరోనా ఎత్తి చూపిందని వివరించింది. 2030 నాటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలంటే ప్రపంచ దేశాలు హై క్వాలిటీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రతి ఒక్కరినీ దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకొచ్చేందుకు పని చేయాలని చెప్పింది. 

ప్రయాణాలపై ఆంక్షలతో.. 

ఇటీవలి కాలంలో ఆసియా, పసిఫిక్‌‌‌‌‌‌‌‌ దేశాల ఎకానమీ చాలా వేగంగా పెరిగింది. 2019లో ప్రపంచ జీడీపీలో ఆసియా, పసిఫిక్‌‌‌‌‌‌‌‌ దేశాల వాటా 35%. కానీ కరోనా వల్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆగిపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రయాణాలపై ఆంక్షల వల్ల వాణిజ్యం,  ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడింది.