
- నాన్ ఇమిగ్రెంట్ వీసాల కాలపరిమితి పెంపు
- కరోనా నేపథ్యంలో అమెరికా నిర్ణయం
న్యూఢిల్లీ ; కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందు వల్ల అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో నివసిస్తోన్న విదేశీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్–1బి సహా ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాల కాలపరిమితి పెంచాలని నిర్ణయించింది. కరోనా భయపెడుతున్నా స్వదేశానికి రాలేక అమెరికాలోనే ఇరుక్కుపోయిన ఇండియన్స్‌కు ఇది నిజంగా శుభవార్త. వీసాలకు సంబంధించి మన ప్రభుత్వం జరిపిన చర్చల తర్వాత యూఎస్ఏ ఈ నిర్ణయం ప్రకటించింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకునే వారు ఎక్స్టెన్షన్ ఫర్ వీసా(ఈఓఎస్) లేదా చేంజ్ ఆఫ్స్టేటస్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.
హెచ్–1బితోపాటు ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసా ఉన్నవాళ్లకు ఇది తప్పనిసరని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన హెచ్–1బి వీసాదారులు ఇలా దరఖాస్తు చేసుకోవడం ద్వారా మరో ఎనిమిది నెలలు అమెరికాలో ఉండవచ్చు. గతంలో ఇలాంటి వారు 60 రోజుల్లోపు దేశం విడిచి వెళ్లవలసి ఉండేది. రూల్స్ ప్రకారం హెచ్–1బి వీసా ఉన్న విదేశీయులకు మాత్రమే అమెరికా కంపెనీలు ఉద్యోగాలిస్తాయి. అది కూడా సంబంధిత రంగంలో నిపుణులు, నిర్దేశిత అనుభవం ఉన్న వారికి మాత్రమే అవకాశమిస్తున్నాయి. కరోనా దెబ్బకు ఇటీవల చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజులే గడువు కావడంతో ఉద్యోగం ఉన్నవారితోపాటు కోల్పోయిన వారు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో వీసాల గడువు పెంచడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా నాన్ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లు అనధికారికంగా అమెరికాలో ఉండరు. ఒక వేళ ఉండవలసి వస్తే రూల్స్ప్రకారం వీసా ఎక్స్పైర్ అవ్వకముందే ఎక్స్టెన్షన్కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు తమకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ నుంచి ధృవీకరణతోపాటు ఇతర పత్రాలను సమర్పిస్తారు. అలా దరఖాస్తు చేసుకున్న వారి వీసా కాలపరిమితి 240 రోజులకు పెరుగుతుంది. ప్రస్తుతం నెలకొన్న కరోనా లాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వీసా ఎక్స్పైర్అయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ దరఖాస్తు అంగీకరిస్తారు. ఇప్పటికే వీసా వీవర్ ప్రొగ్రామ్(వీడబ్ల్యూపీ) కిందకు వచ్చిన వారి నుంచి వీసా ఎక్స్టెన్షన్ లేదా చేంజ్ ఆఫ్ స్టేటస్అప్లికేషన్లు తీసుకోమని యూఎస్సీఐఎస్ చెప్పింది. అయితే ఈ కేటగిరీలో ఉండి కరోనా వల్ల దేశం విడిచి వెళ్లలేకపోయిన వారికి మాత్రం స్వదేశానికి వెళ్లేందుకు 30 రోజులు దాకా గడువు ఇస్తామని తెలిపింది.