ఆస్పత్రిలో పరీక్షకు ప్రిపేరవుతున్న కరోనా పేషంట్

ఆస్పత్రిలో పరీక్షకు ప్రిపేరవుతున్న కరోనా పేషంట్

కరోనా కేసులు దేశంలో విపరీతంగా నమోదవుతున్నాయి. చాలామంది కరోనా వస్తే తగ్గదేమోననే భయం మరియు తమ కుటుంబసభ్యులకు కూడా సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఒక యువకుడు మాత్రం కరోనాను కాస్తైనా లెక్కచేయకుండా.. తన పని తాను చేసుకుంటున్నాడు. అది కూడా హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడు.. ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి..

ఒడిశాలోని గంజాం జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ అయిన విజయ్ కులాంగే బుధవారం బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని కోవిడ్ పేషంట్లందరినీ పలకరిస్తూ ధైర్యం చెబుతున్నాడు. అలా వార్డులో తిరుగుతున్న సమయంలో కలెక్టర్ విజయ్.. ఒక బెడ్ దగ్గర ఉన్న పేషంట్‌ను చూసి సడెన్‌గా ఆగిపోయాడు. ఆ పేషంట్ తన బెడ్ మీద కాలిక్యులేటర్, కొన్ని పుస్తకాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఆశ్చర్యపోయిన కలెక్టర్.. పేషంట్ దగ్గరికెళ్లి ఏంటి? ఏం చేస్తున్నావ్? అని ఆరా తీశాడు. అప్పుడు ఆ యువకుడు తానో సీఏ స్టూడెంట్‌నని.. రాబోయే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు. అది విన్న విజయ్.. ఆ రోగి అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 

వెంటనే ఆ యువకుడి మనోధైర్యాన్ని మెచ్చుకుంటూ కలెక్టర్ తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశాడు. ‘నేను కోవిడ్ ఆస్పత్రిని సందర్శించినప్పుడు ఈ యువకుడు సీఏ పరీక్ష కోసం చదువుతున్నాడు. అతని అంకితభావం బాధను మరచిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత వచ్చే విజయం కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రమే. విజయం యాదృచ్చికంగా రాదు. దానికి డెడికేషన్ అవసరం’ అని కలెక్టర్ ట్వీట్ చేశారు. కలెక్టర్ చేసిన ఆ ట్వీట్ కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు మరియు షేర్లు సాధించింది.