AUS vs WI: ఆస్ట్రేలియా అత్యుత్సాహం.. కరోనా వచ్చిన ఆటగాడికి జట్టులో చోటు

AUS vs WI: ఆస్ట్రేలియా అత్యుత్సాహం.. కరోనా వచ్చిన ఆటగాడికి జట్టులో చోటు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు జరిపిన వైద్య పరీక్షల్లో ఆసీస్ జట్టులో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరిని ఐసోలేష‌న్‌లో ఉంచారు. క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన ఈ చర్యలు నామమాత్రమే. 24 గంటలు గడవక ముందే వారిద్దరూ జట్టుతో కలిసిపోయారు.

జనవరి 25 నుంచి ఆస్ట్రేలియా- వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కాగా, కామెరాన్ గ్రీన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాకపోతే అతను సహచర ఆటగాళ్లకు  దూరం దూరంగా ఉంటూ అంటరాని వాడిలా నడుచుకున్నాడు. చివరకు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆలపించే జాతీయ గీతం సమయంలో కూడా అతను దూరంలో నిల్చున్నాడు. ఇప్పటివరకూ జరిగిన తొలిరోజు ఆటలో అతను ఎవరితోనూ కాంటాక్ట్‌ కాలేదు. అయితే, అతను బంతి పట్టుకున్న ప్రతీసారి శానిటైజేషన్ చేయాల్సి వస్తోంది. 

కాగా, తొలి టెస్ట్ ముగిసిన అనంతరం జరిపిన వైద్య పరీక్షల్లో ఆ జట్టు బ్యాటర్ ట్రావిస్ హెడ్ కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా, అతను ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఇప్పటివరకూ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 4123 పరుగులు చేసింది. జాషువా డా సిల్వా(27), కెవెం హాడ్జ్(32) క్రీజులో ఉన్నారు.