
గోదావరిఖని, వెలుగు: పదేపదే చోరీలకు పాల్పడడం, నకిలీ విత్తనాల రవాణా, ఇతర నేరాలకు పాల్పడిన వారిపై ‘గ్యాంగ్ ఫైల్స్’ ఓపెన్ చేయాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా సూచించారు. శుక్రవారం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలో 34 కేసుల్లో 98 మందిని అరెస్ట్ చేసి రూ.77.63 లక్షల విలువైన 157 కేజీల గంజాయిని సీజ్ చేశామని, మంచిర్యాల జోన్ పరిధిలో 34 కేసుల్లో 98 మందిని అరెస్ట్ చేసి రూ.16.69 లక్షల విలువైన 34 కిలోల గంజాయిని సీజ్ చేసినట్టు సీపీ చెప్పారు. కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులకు క్యాష్ అవార్డులు అందజేశారు.