2022లో మొత్తం 22,060 కేసులు: సీపీ సీవీ ఆనంద్

2022లో మొత్తం 22,060 కేసులు: సీపీ సీవీ ఆనంద్

2022లో మొత్తం 22,060 కేసులు నమోదయ్యాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇయర్ ఎండింగ్ క్రైమ్ పై సమీక్ష నిర్వహించిన సీవీ ఆనంద్...  2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని చెప్పారు. ఈ ఏడాది 273 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని.., ఈ కేసుల్లో 1082 నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిలో 13 మంది విదేశీయులున్నారని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా గతేడాది 910 మందిని, 2022 లో 791 మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. అందులో 74 మంది గర్ల్స్, 717 బాలురు ఉన్నారని చెప్పారు. 2022లో 2249 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 226 కేసులు ఛేదించామన్నారు. హ్యాకింగ్  92 కేసులు నమోదు కాగా, 8 కేసులను ఛేదించామని తెలిపారు.

ATM / డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించి 386 కేసులు నమోదు కాగా... వీటిలో 35 కేసులు ఛేదించామని సీవీ ఆనంద్ చెప్పారు. Olx , ఆన్ లైన్ మోసాల్లో భాగంగా 97 కేసులు నమోదైతే, 07 కేసులు పరిష్కరించామన్నారు. ఆన్ లైన్ కమ్యూనల్ పోస్ట్ లకు సంబంధించి 68 కేసులు నమోదు చేసి, 04 కేసులు సాల్వ్ చేశామని చెప్పారు. నైజీరియన్ మోసాలు 41 కేసులు నమోదు చేయగా, 06 కేసులను ఛేదించామన్నారు. 11 మ్యాట్రిమోని కేసుల్లో 05 కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది టాస్క్ ఫోర్స్ వింగ్ 1703 కేసులు నమోదు చేయగా.. 3187 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 2021 లో 2766, 2022లో 2292 ఫిర్యాదులను షీ టీమ్స్ స్వీకరించిందన్నారు. వాటిల్లో 137 కేసులపై ఎఫ్ఐఆర్ లు ఫైల్ చేయగా.. 427 కేసులు నమోదయ్యాయన్నారు. ఉస్సేన్ సాగర్ లో ఆత్మహత్యాయత్నం చేసిన 235 మందిని ట్యాంక్ బండ్ లేక్ పోలీసులు కాపాడారని సీవీ ఆనంద్ తెలిపారు. 

మహిళలపై జరిగిన నేరాల్లో భాగంగా ఈ ఏడాది 2524 కేసులు నమోదయ్యాయని సీవీ ఆనంద్ తెలిపారు. వీటిలో 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు, 1418 మహిళలపై వేధింపుల కేసులున్నాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 91 మందిపై రౌడీ షీట్ పెట్టామని సీపీ తెలిపారు. ఆస్తుల దొంగతనం కేసుల్లో రూ.25 కోట్ల ప్రాపర్టీ చోరీ అవగా... 62% రికవరీ చేశామన్నారు. ఆర్థిక నేరాల కింద 949 కేసులు నమోదు కాగా... రూ.15 వందల కోట్లకు పైగా డబ్బును నేరగాళ్లు కొల్లగొట్టారని చెప్పారు. వివిధ కేసుల్లో 21 మందికి జీవితఖైదు పడేలా చేశామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 63 మర్డర్ కేసులు నమోదయ్యాయన్నారు. అటు చీటింగ్ కేసులు భారీగా పెరిగాయని...ఇప్పటి వరకు 4297 కేసులు నమోదయ్యాయన్నారు. 456 గేమింగ్ కేసుల నమోదుతో పాటు 70 శాతం కన్విక్షన్ రేటు నమోదైందని చెప్పారు. 113 అట్రాసిటీ కేసులు ఫైల్ అయ్యాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది 24 మందికి పైగా కొత్తగా పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. డయల్ 100 కి 2 లక్షల 33 వేల కాల్స్ వచ్చాయన్న సీపీ... ఈ ఏడాది కొత్తగా 47 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీవీ ఆనంద్ వివరించారు.