యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రత విషయంలో స్పెషల్ ఫోకస్ చేశామని రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్ చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని బుధవారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కొండపైన ఇటీవల అందుబాటులోకి వచ్చిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించి, అదనంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
భద్రతా అంశాలపై కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నరసింహారెడ్డి, సీఐలు సైదయ్య, నవీన్, ట్రాఫిక్ సీఐ శివశంకర్‌గౌడ్ పాల్గొన్నారు.