క్రికెట్ ను జూదంగా మార్చకండి..బెట్టింగ్ ముఠాలకు సీపీ వార్నింగ్

క్రికెట్ ను జూదంగా మార్చకండి..బెట్టింగ్ ముఠాలకు సీపీ వార్నింగ్
  • యువత జీవితాలతో ఆడుకుంటే పీడీ యాక్ట్ తప్పదు
  • ఐపీఎల్ నేపథ్యంలో యువతకు పలు సూచనలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో బెట్టింగ్ ముఠాల పట్ల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్​ను కేవలం ఒక క్రీడగా ఆస్వాదించాలి తప్ప, దానిని జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.

గతంలో తాము చేపట్టిన ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’  ప్రచారానికి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని, కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్​లను నిషేధించడమే కాకుండా కఠినమైన ఆన్‌‌లైన్ గేమింగ్ బిల్లును కూడా తీసుకువస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా

కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త వెబ్​సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. కేవలం ఆన్​లైన్ మాత్రమే కాకుండా.. నివాస గృహాలు, ఫామ్​ హౌస్​లు, ఇతర రహస్య స్థావరాల్లో గుంపులుగా చేరి ఫోన్ల ద్వారా ఆఫ్​లైన్ బెట్టింగ్‌‌లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.

స్థానిక బుకీలు యువతను ఆకర్షించి అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్  ప్రయోగించడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

అత్యాశకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ చివరికి కన్నీళ్లే మిగిలిస్తుందని, బెట్టింగ్​లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని కమిషనర్ హితవు పలికారు. ఈ వ్యసనానికి బానిసలైతే పచ్చని సంసారాలు రోడ్డున పడతాయని, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. నగరాన్ని, యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

సమాచారం ఇవ్వండి

మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా మిమ్మల్ని బెట్టింగ్ పేరుతో వేధిస్తుంటే వెంటనే డయల్ 100 కు గానీ, లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555 కు గానీ సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.