మోడీ సర్కారును గద్దె దింపుతాం: సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా 

మోడీ సర్కారును గద్దె దింపుతాం: సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా 
  • విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు షురూ

హైదరాబాద్, వెలుగు: దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్​ ఎల్లకాలం పాలించలేవని, వచ్చే సాధారణ ఎన్నికల్లో మోడీ సర్కారును గద్దె దింపుతామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష శక్తులను కూడగడతామని ఆయన తెలిపారు. ఎర్రజెండా మాత్రమే భారతదేశ ఆశ, భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఏపీలో విజయవాడలోని ఎంబీ స్టేడియంలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అధ్యక్షత వహించారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ నాయకులు అతుల్ కుమార్ అంజన్, అమర్ జీత్ కౌర్, రాజేందర్, చాడ వెంకట్ రెడ్డి, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, దేశంలోని భిన్నత్వం, రాజ్యాంగాన్ని కాపాడడం తమ ముందున్న కర్తవ్యమన్నారు. ప్రజాస్వామిక హక్కులు, మానవ హక్కులను కేంద్రం అణవేస్తున్నదని రాజా ఆరోపించారు. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై అర్బన్‌‌ నక్సలైట్  మావోయిస్టు, దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారని రాజా ఫైరయ్యారు. మోడీ అనుసరిస్తున్న విధానాలతో రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని నారాయణ అన్నారు. ఇతర పార్టీల నేతలపై సీబీఐతో దాడులు చేయిస్తూ, బ్లాక్‌‌మెయిలింగ్‌‌ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. 

ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ మహిళలు

బహిరంగ సభకు ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఐ, అనుబంధ ప్రజా సంఘాల కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా ప్రదర్శనలో పాల్గొన్నారు.  మహిళలు 120 అడుగుల బ్యానర్‌‌ను పట్టుకుని  ప్రదర్శన చేశారు. ప్రదర్శనలో బతుకమ్మలు, బోనాలతో పాల్గొన్న తెలంగాణ మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.