
న్యూఢిల్లీ: మనదేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) జూన్‌లో ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.10 శాతానికి దిగొచ్చింది. ఇందుకు ఆహార పదార్ధాల ధరలు తగ్గడం, అనుకూల బేస్ ఎఫెక్ట్ కారణమని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం పేర్కొంది. వరుసగా ఐదో నెలలోనూ ఆర్‌బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్ 4శాతం కంటే దిగువన రిటైల్ ఇన్‌ఫ్లేషన్ నమోదైంది.
ఈ ఏడాది జూన్‌లో ఇన్‌ఫ్లేషన్ అంతకు ముందు నెలతో పోలిస్తే 0.72 శాతం తగ్గింది. జనవరి 2019 తర్వాత అత్యల్ప స్థాయికి చేరింది. ఈ ఏడాది మేలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 2.82శాతంగా, కిందటేడాది జూన్‌లో 5.08శాతంగా రికార్డ్ అయ్యింది. సీపీఐ లెక్కల్లో సగం వాటా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్‌దే ఉంటుంది. ఆహార పదార్ధాల ధరల పెరుగుదలను కొలిచే ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ కిందటి నెలలో -మైనస్ 1.06 శాతానికి దిగొచ్చింది.
మేలో 0.99శాతంగా ఉంది. కూరగాయలు, గింజలు, మాంసం, చేపలు, తృణ ధాన్యాలు, చక్కెర, పాలు, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గడమే దీనికి కారణం. టమాట, బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు దిగొచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసనా భరద్వాజ్ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఆర్‌బీఐ వేసిన అంచనా 3.7 శాతం కంటే 50 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది.
రాబోయే ఎంపీసీ మీటింగ్‌లలో రేట్ల కోత ఉండకపోవచ్చు”అని అన్నారు. కాగా, ఆర్‌బీఐ గత నెలలో రెపో రేటును 5.5 శాతానికి తగ్గించింది. పాలసీ వైఖరీని “న్యూట్రల్”గా మార్చింది.
19 నెలల తర్వాత మళ్లీ నెగెటివ్‌లోకి హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్
హోల్‌సేల్ ధరల పెరుగుదలను కొలిచే డబ్ల్యూపీఐ ఈ ఏడాది జూన్‌లో 19 నెలల కనిష్టమైన మైనస్ 0.13 శాతానికి -తగ్గింది. ఈ ఏడాది మేలో ఇది 0.39శాతంగా, గత ఏడాది జూన్‌లో 3.43శాతంగా నమోదైంది. ఆహార వస్తువులు, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ నెగెటివ్‌లోకి జారింది.