ఎమ్మెల్యేలను కొని సర్కారును కూలుస్తరా? : కూనంనేని సాంబశివరావు

ఎమ్మెల్యేలను కొని సర్కారును కూలుస్తరా? : కూనంనేని సాంబశివరావు
  •     ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: కూనంనేని
  •     గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలెవరూ ఇప్పుడు అసెంబ్లీలో లేరు.. ఇంటికో ఉద్యోగమని బీఆర్ఎస్​ మోసం చేసిందని కామెంట్​

హైదరాబాద్, వెలుగు :  ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు వేరే ప్రభుత్వాలు ఏర్పడాల్సిందేనని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఆరు నెలలు, ఏడాదిలోనే కూలిపోతుందంటూ ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదని ఆయన విమర్శించారు. అంటే ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. 

గతంలో చాలా మంది ఎమ్మెల్యేలను కొన్నారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో అమ్ముడు పోయిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అసెంబ్లీలో లేరని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.. శనివారం ఆయన అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. లక్ష కోట్ల రూపాయలతో కడుతున్న ప్రాజెక్టుల్లో అసలు ఖర్చు రూ.10 వేల కోట్లే అవుతున్నాయని, మిగతా డబ్బంతా ఎక్కడికి పోతున్నదో తెలియడం లేదన్నారు. 

దాన్ని కంట్రోల్​ చేయగలిగితే చాలా డబ్బు ఆదా అవుతుందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్​ నిధులను తెప్పించుకునే ప్రయత్నం చేస్తే.. రూ.70 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తాయన్నారు. 50 ఏండ్ల చరిత్ర, పదేండ్ల చరిత్ర అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నేండ్ల చరిత్ర అయినా గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, ఆయా ప్రభుత్వాల కృషి మీదనే మిగతా ప్రభుత్వాలూ కొత్తగా జాతి నిర్మాణాన్ని చేస్తుంటాయని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ నేతల అసహనం

కూనంనేని మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్​నేతలు తీవ్ర అసహనంతో ఊగిపోయారు. అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. సభ సజావుగా సాగాలన్నా, ప్రజల సమస్యలు వినాలన్నా సభను ఎక్కువ రోజులు నడపాల్సిన అవసరం ఉందని, కానీ, గత ప్రభుత్వం మాత్రం అందుకు చొరవ చూపించలేదని కూనంనేని అనడంతో.. మధ్యలో జోక్యం చేసుకున్న బీఆర్ఎస్​ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ఎన్ని నాణ్యమైన గంటలు సభ నడిచిందో చూడాలే గానీ.. ఎన్ని రోజులు నడిపామన్నది కాదని అన్నారు. 

అసహనంతో మైక్​ను గట్టిగా కొట్టారు. ప్రస్తుత ప్రభుత్వం గత తప్పిదాలను పునరావృతం చేయొద్దని పలు సూచనలు చేస్తున్న సందర్భంలోనూ బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి పదే పదే ఆటంకం కలిగించారు. 

హరీశ్​రావు నన్ను బెదిరిస్తరా..

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే కాంగ్రెస్​ ప్రభుత్వం చేయొద్దని కూనంనేని సాంబశివరావు సూచించారు. అందులో మొదటిది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దని, రెండోది తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారని, ఆ స్వేచ్ఛను ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడిందని అనడంతో.. జగదీశ్​రెడ్డి మండిపడ్డారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి అక్రమ నిర్బంధాలకు పాల్పడలేదా అని జగదీశ్​రెడ్డి ప్రశ్నించారు. దీంతో అలాంటి తప్పులనే మీరు చేస్తారా అంటూ జగదీశ్​రెడ్డికి కూనంనేని కౌంటర్​ఇచ్చారు. 

కోదండరాం, రేవంత్​రెడ్డి సహా ఎందరినో బీఆర్ఎస్​ప్రభుత్వం నిర్బంధించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ కు ఆనాడు సపోర్ట్​గా ఉన్న వామపక్ష నేతలనూ బీఆర్ఎస్​హౌస్​అరెస్టులు చేయలేదా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగమిస్తామని బీఆర్ఎస్​హామీ ఇచ్చి మోసం చేసిందని కూనంనేని అనగా.. హరీశ్​రావు కల్పించుకొని ఆధారాలుంటే చూపించాలంటూ గట్టిగట్టిగా అరిచారు. 

హరీశ్​రావు ఇలాగే బెదిరిస్తారా.. ఇదే సభా మర్యాదనా అంటూ కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్​ బెడ్రూం ఇండ్లు ఎందుకివ్వలేదని నిలదీశారు. ఉద్యోగులకు ప్రతినెలా ఫస్ట్​కు జీతాలెందుకు వెయ్యట్లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు స్కాలర్​షిప్పులు రావడం లేదని, పంచాయతీలకు ఫండ్స్​ ఇవ్వలేదని, సింగరేణి ఆస్తులు రూ.57 వేల కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆయన ఆరోపించారు.