
- ఎర్రజెండాలన్నీ ఒక్కటి కాకుంటే ఉనికికే ప్రమాదం
- సీపీఐ జాతీయ నేత నారాయణ, ప్రజా గాయని విమలక్క
- జనగామ జిల్లా కడవెండిలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సభ
పాలకుర్తి( దేవరుప్పుల), వెలుగు : దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి, లౌకిక వ్యవస్థకు సమాధి కట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. ఇకనైనా ఎర్రజెండాలన్నీ ఒక్కటి కావాలని లేకుంటే ఉనికికే ప్రమాదమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79 వర్ధంతి సందర్భంగా శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి ప్రజాగాయని విమలక్కతో కలిసి వెళ్లి.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్పేరుతో అమిత్‌షా మావోయిస్టులను అంతం చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు.
అమిత్‌షా నేరపూరిత చరిత్ర నుంచి వచ్చిన వాడని, ఆయనపై కేసులు ఉంటే 12 మందిని చంపేదాకా నిర్దోషి కాలేదని ఆరోపించారు. అలాంటి నేత కేంద్ర హోం మంత్రి అయ్యారని పేర్కొన్నారు. రాజకీయంగా తాము బీజేపీని వ్యతిరేకిస్తే, వారు కమ్యూనిస్టులను వ్యతిరేకించవచ్చన్నారు. కానీ, మాట్లాడితే చంపేస్తామంటే అది ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజా గాయని విమలక్క మాట్లాడు తూ.. ఆనాడు.. ఈనాడు భూమి సమస్యనే కొనసాగుతుందని, ఇప్పటికి కూడా భూమి పంచిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. అడవులపై ఆదివాసులకే హక్కులు కల్పించాలని కోరారు.