
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు : బీఆర్ఎస్తో పొత్తు ఉన్నా.. లేకున్నా హుస్నాబాద్‌లో సత్తా చాటాలని సీపీఐ నేతలు సిద్ధపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో రాజకీయ సమీకరణలు మారాయి.మునుగోడులో బీఆర్ఎస్కు లెఫ్ట్ పార్టీలు మద్దతునిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందన్న సంకేతాలున్నాయి. పొత్తు ఉండే పక్షంలో హుస్నాబాద్ కోసం సీపీఐ పట్టుబట్టాలని భావిస్తోంది. కమ్యూనిస్టులకు గట్టిపట్టున్న హుస్నాబాద్ లో దేశిని చినమల్లయ్య ఐదు సార్లు గెలిచారు. చాడ వెంకటరెడ్డి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయారు. ఈసారి సీపీఐ అభ్యర్థిగా చాడ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలువాలని ఆయన ఇప్పటినుంచే హుస్నాబాద్ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు.
సమస్యలపై ప్రజలను సంఘటితం చేసే దిశగా..
హుస్నాబాద్ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజలను సంఘటితం చేసే దిశగా సీపీఐ పనిచేస్తోంది. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ అవకతవకలు, సబ్ కోర్టు మంజూరు, గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలతో పాటు మండలాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను మరింత క్రియాశీలకం చేసేందుకు ‘గడప గడపకూ సీపీఐ’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికను రూపొందించారు.
మూడు జిల్లాలతో సంబంధం..
హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, కరీంనగర్ జిల్లాలో సైదాపూర్, చిగురుమామిడి, హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలున్నాయి. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకునే నేతలు మూడు జిల్లాల క్యాడర్ తో సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
బహుముఖ పోటీ అనివార్యం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ టీపీ, బీఎస్పీతోపాటు సీపీఐ, బీఆర్ఎస్ పోటీ పడే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్తో కమ్యూనిస్టు మధ్య పొత్తు కుదిరితే మాత్రం సీపీఐ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ బహుముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.