కేసీఆర్ వైఖరితో  ప్రగతిశీల శక్తులు ఏకమవుతున్నాయి

కేసీఆర్ వైఖరితో  ప్రగతిశీల శక్తులు ఏకమవుతున్నాయి

న్యూఢిల్లీ: కేసీఆర్ బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నాక  ప్రగతిశీల శక్తులు ఏకమవుతున్నాయని సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. సీపీఐ జాతీయ మహాసభల్లో దేశానికి దశ దిశ నిర్దేశించే రాజకీయ తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్ కు ఉన్నందునే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక నియంతృత్వ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. మైనార్టీల పై, దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలపై మోడీ సర్కారు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులతో ఒక వేదిక ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికి విభజన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.  తెలంగాణ రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.