కాంగ్రెస్​కు సీఎం పదవి.. మాకు సీట్లు కావాలి

 కాంగ్రెస్​కు సీఎం పదవి.. మాకు సీట్లు కావాలి

న్యూఢిల్లీ, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సీఎం పదవి కావాలని, తమకు సీట్లు కావాలని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నారాయణ మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోనే సీపీఐ ఉందన్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయాలని మేం కోరుతున్నట్లు చెప్పారు. 

కాంగ్రెస్​తో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సీపీఐ మద్దతు ఇస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే దేశం నార్త్, సౌత్​గా విడిపోవడం ఖాయమన్నారు. డీలిమిటేషన్ పేరుతో రాష్ట్రాల మధ్య గొడవ పెడుతున్నదని ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళల ఓట్ల కోసం ఈ బిల్లు తెచ్చినట్లు ఉందని విమర్శించారు.