పేదలకు  పట్టాలివ్వకపోతే హైదరాబాద్​ను ముట్టడిస్తాం

పేదలకు  పట్టాలివ్వకపోతే హైదరాబాద్​ను ముట్టడిస్తాం

పేదలకు  పట్టాలివ్వకపోతే హైదరాబాద్​ను ముట్టడిస్తాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులు మిత్రులు.. ఇప్పుడు శత్రువులా? మా వాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు. గుడిసెవాసులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోతే హైదరాబాద్​ను ముట్టడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టాల కోసం మరో ఉద్యమం చేస్తామని, ఇండ్ల కోసం చావో.. రేవో తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూముల లెక్కలు తీసి వాటిని పేదలకు పంచాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్​తో సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్​ కలెక్టరేట్​ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వరంగల్ నగరం చుట్టుపక్కల సర్కారు భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలు పెద్ద సంఖ్యలో ఏకశిల పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్​ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తరువాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇతర నేతలు పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని వరంగల్ కలెక్టరేట్​లో వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అసలు స్థలమే లేకపోతే పేదలు ఇండ్లు ఎక్కడ కట్టుకుంటారని ప్రశ్నించారు. పెరిగిన ధరల దృష్ట్యా రూ.3 లక్షలు సరిపోవని, రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం ముందుగా ఇండ్లు లేని నిరుపేదల లెక్కలు తీయాలని డిమాండ్​ చేశారు. డబుల్​బెడ్​ రూం ఇండ్లు ఎన్ని కట్టించారో చెప్పాలన్నారు.వరంగల్ జిల్లాలో  నాలుగు నెలలుగా  ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తున్నా  రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పట్టాలు తక్షణమే ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా నివాస స్థలాల కొరకు ఆందోళన చేస్తున్న పేద ప్రజలను సంఘటిత పరిచి హైదరాబాద్​ను ముట్టడిస్తామన్నారు.