
పెద్దపల్లి, వెలుగు : సీపీఐ పోరాటాల ద్వారానే కార్మిక చట్టాలు ఏర్పడ్డాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. పెద్దపల్లిలోని ఎన్‌ఎస్ భవన్‌లో గురువారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అది పెద్ద పార్టీ సీపీఐ అని చెప్పారు. సీపీఐకి వందేండ్ల చరిత్ర ఉందని, ఆ పార్టీని కార్యకర్తలు రక్షిస్తే.. పార్టీ ప్రజాస్వామ్యన్ని రక్షిస్తుందన్నారు.
ఆపరేషన్ కగార్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, మావోయిస్టులపై కేంద్రం సాగిస్తున్న మారణకాండను నిలిపివేసేలా చూడాలని కోరారు. అంతకుముందు జెండాను ఆవిష్కరించి, అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు మార్కపురి సూర్య, రేణిగుంట్ల ప్రీతం, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పాల్గొన్నారు.