కొడితే స్టేడియం అద్దాలే పగిలిపోయాయి.. విండీస్ బ్యాటర్ల పవర్ ఇదీ

కొడితే స్టేడియం అద్దాలే పగిలిపోయాయి.. విండీస్ బ్యాటర్ల పవర్ ఇదీ

వెస్టిండీస్ క్రికెటర్లు ఎంత బలశాలులో అందరికీ విదితమే. బంతిని బౌండరీకి తరలించటం అన్నది వీరికి వెన్నతో పెట్టిన విద్య. చేత్తో విసిరినంత ఈజీగా బంతిని స్టాండ్స్‌లోకి పంపుతుంటారు. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రస్సెల్, కార్లోస్ బ్రాత్ వైట్, ఎల్విన్ లెవీస్.. ఇలా చెప్పుకుంటూ పోతే విండీస్ జట్టు నిండా బలశాలులే.. విధ్వంసకర క్రికెటర్లే. 

ఒకవేళ బంతికి ప్రాణం ఉండుంటే.. వీరి కొట్టే ప్రతి షాట్‌కు కన్నీళ్లు పెట్టుకునేది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా! ఆ జట్టు ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలెన్‌ కొట్టిన ఓ షాట్‌కు స్టేడియం అద్దాలే పగిలిపోయాయి. అమెజాన్‌ వారియర్స్‌- జమైకా తల్లావాస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అలెన్‌ భారీ సిక్సర్‌తో మెరిశాడు. అతడు కొట్టిన సిక్స్‌ దెబ్బకు గయానా స్టేడియం కిటికీ అద్దం పగిలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సిక్సర్లే మ్యాచ్‌కు హైలైట్‌

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జమైకా 152 పరుగులు చేయగా.. అమెజాన్‌ వారియర్స్‌ మరో తొమ్మిది బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో అలెన్‌ కొట్టిన రెండు సిక్సర్లే హైలెట్. డ్వేన్‌ ప్రిటోరియస్‌ వేసిన 18వ ఓవర్‌ ఆఖరి బంతికి కిటికీని పగలగొట్టిన అలెన్‌.. తదుపరి ఓవర్లో తాహిర్‌ వేసిన బంతిని 103 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. 

Also Read :- ధోనీ కాదు.. ఇండియన్ క్రికెట్ లో అతడే గ్రేట్ ఫినిషర్: విరాట్ కోహ్లీ

153 పరుగుల లక్ష్య ఛేదనలో గయానా బ్యాటర్, పాక్ యువ క్రికెటర్ సయీమ్‌ అయూబ్‌ (85; 53 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులు) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు.