
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరుగుతున్నా నియంత్రణ, రక్షణ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బుధవారం మందమర్రి ఆఫీస్‌ముందు కార్యకర్తలు, కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు. సీపీఎం జిల్లా సెక్రటరీ సంకె రవి మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ధ్యేయంగా కార్మికులపై సింగరేణి ఆఫీసర్లు ఒత్తిడి చేస్తూ పనిస్థలాల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడంలేదని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న ప్రమాదాలు, రక్షణ వ్యవస్థపై హైకోర్టు సిట్టింగ్‌జడ్జితో ఎంక్వయిరీ చేయాలని డిమాండ్‌చేశారు.
డీజీఎంఎస్తో నిర్వహించే రక్షణ త్రిసభ్య కమిటీ సమావేశాల్లో అన్ని సంఘాలను ఆహ్వానించి పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల భద్రతపై చర్చించాలన్నారు. రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య నిపుణులను నియమించాలని కోరారు. పలు డిమాండ్లు పరిష్కరించాలని ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ, కమిటీ సభ్యులు గొమాస ప్రకాశ్, బొడెంకి చందు, దూలం శ్రీనివాస్, గొమాస అశోక్, సామల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.