దహెగాం, వెలుగు: గిర్రె గ్రామంలో గర్భిణి తలండి శ్రావణి హత్య జరిగి వారం దాటినా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే.. ఎవరూ బాధిత కుటుంబాన్ని పరామర్శించరా? గిరిజనులంటే అంత లోకువా అని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. శనివారం ఆ గ్రామానికి పాదయాత్రగా వెళ్లి, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
హంతకుడైన మృతురాలి మామ సత్తయ్యను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఇల్లు, 5 ఎకరాల భూమి, రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సచిన్, సీపీఎం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి రాజన్న తదితరులున్నారు.
సీఎం స్పందించాలి
ఆసిఫాబాద్, వెలుగు: గర్భిణి శ్రావణి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ శాఖ డైలీ లేబర్స్కు మద్దతు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రాజన్నతో కలిసి మాట్లాడారు. ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. శ్రావణి హత్యపై జిల్లా అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
