హైదరాబాద్, వెలుగు: మద్యం టెండర్ల విషయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, మద్యం షాపులు, టెండర్ల విషయాల్లో వేలం పాడటానికి మొత్తం సిండికేట్ అయ్యారని, పాత వాళ్లకే టెండర్లు ఇవ్వాలని అధికారులు, కొత్త వాళ్లకే ఇవ్వాలని ఆ శాఖ మంత్రి పట్టుబట్టినట్టు తెలుస్తున్నదని చెప్పారు.
అధికారులు, మంత్రికి మధ్య విభేదాలకు కారణం ఏమిటి? ఐఎఏస్ రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకోవడానికి కారణాలు ఏమిటి? వీటిపై ప్రభుత్వం, సీఎం స్పందించకపోవడం సరికాదన్నారు. తక్షణమే ఆ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, వాటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులతోపాటు పలుకుబడి కలిగిన నాయకుల ఒత్తిడిల వల్లే పదేండ్ల సర్వీస్ ఉండగానే ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకోవడానికి కారణాలు ఏమిటో బహిర్గతం చేయాలని కోరారు.
