అమీన్పూర్, వెలుగు : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శంభుని కుంటను కబ్జాదారుల నుంచి కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ రాజయ్య డిమాండ్ చేశారు. శంభుని కుంటను కాపాడాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షల విలువ చేసే ప్రభుత్వ భూములను, చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్న ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కబ్జాలపై గత ప్రభుత్వం విధానాలనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ భూములు, చెరువు, కుంటల పరిరక్షణకు అమీన్పూర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు, పోరాటాలు చేపట్టామన్నారు.
కబ్జాల నుంచి శంభుని కుంట రక్షణ కోసం హైడ్రా, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. దాదాపు పదిహేను వందల మంది ప్రజల సంతకాలు సేకరించి కలెక్టర్‌కు అందించామన్నారు. కుంట రక్షణ కోసమే తాము నిరాహార దీక్షకు దిగామని, అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సింహారెడ్డి, నాగేశ్వర్రావు, పాండురంగారెడ్డి, లలిత, శ్రీనివాస్‌రెడ్డి, జార్జ్, సునీత, పద్మావతి, మల్లేశ్వరి, లావణ్య, వీరస్వామి, మణిరాజు తదితరులు పాల్గొన్నారు.
