కోరిన సీట్లు ఇస్తేనే పొత్తు..48 గంటల్లో తేల్చాలి.. కాంగ్రెస్​కు కామ్రేడ్ల డెడ్​లైన్​

కోరిన సీట్లు ఇస్తేనే పొత్తు..48 గంటల్లో తేల్చాలి.. కాంగ్రెస్​కు కామ్రేడ్ల డెడ్​లైన్​
  • సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు!
  • సీపీఎంకు మిర్యాలగూడ ఓకే, మరోటి పెండింగ్​
  • చెన్నూరు సీటుపై సీపీఐ అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో లెఫ్ట్, కాంగ్రెస్ సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఐదేసి సీట్ల చొప్పున సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. రెండేసి చొప్పున ఇచ్చేందుకు కాంగ్రెస్​ ఒప్పుకుంది. అందులో ఒకటి కోరుకున్న సీటు.. మరొకటి ఎక్కడైనా ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. దీనిపై కామ్రేడ్స్​ మండిపడుతున్నారు. ఆ రెండేసి సీట్లు కూడా తాము కోరుకున్న చోట ఇవ్వాలని, అట్లయితే పొత్తు ఉంటుందని,  లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. 48 గంటల్లో తేల్చాలని డెడ్​లైన్​ పెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్​తో పొత్తు కుదరకపోతే సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. 

ఐదేసి అడిగితే..

సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలను ఇవ్వాలని కాంగ్రెస్​ను కోరుతున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తుల అంశం జాతీయస్థాయిలోనే నడుస్తున్నది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ నేతలతో పలుమార్లు చర్చలు జరిపి, చివరికి చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. దీంట్లోనూ కోరుకున్న సీట్లలో ఒకటి.. ఇంకోటి ఎక్కడైనా ఇస్తామని ఇరుపార్టీలకు కాంగ్రెస్​ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగా సీపీఐ కోరుకున్న ఐదు సీట్లలో  మునుగోడు కానీ, కొత్తగూడెం గానీ ఇస్తామని చెప్పగా.. చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు తెలిసింది. మరోటి తాము అనుకున్నట్లుగా చెన్నూరు సీటు ఇస్తామని కాంగ్రెస్​ పేర్కొన్నట్లు తెలిసింది. సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇస్తామని కాంగ్రెస్​ స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోసీటుపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తప్పనిసరిగా  సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుపడుతున్నది. ఇప్పటికే సీపీఎం ప్రతిపాదించిన సీట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిరలో అభ్యర్థులను కాంగ్రెస్​ ప్రకటించగా.. పాలేరులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు తమకు ఇవ్వాల్సిందేననీ సీపీఎం జాతీయస్థాయి నుంచి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నది. కాగా, రెండో సీటు కింద తమకు చెన్నూరు ఇస్తామనడంపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. 

సీపీఐలో ‘మునుగోడు’లొల్లి 

హైదరాబాద్​లోని మగ్దుంభవన్​లో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేర్వేరుగా జరిగాయి. రెండు సమావేశాల్లోనూ పొత్తులపై తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సీటులో పోటీ చేయాల్సిందేనని ఆ జిల్లా నాయకత్వం గట్టిగా పట్టుపట్టింది. కాంగ్రెస్​ ప్రతిపాదించినట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు సీటుకు ఓకే చెప్పాల్సిందని డిమాండ్​ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఐ పోటీ చేయకపోతే, పార్టీకి తీవ్ర నష్టమని తెలిపినట్లు సమాచారం.