కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర పాలన : జాన్‌‌ వెస్లీ

కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర పాలన :  జాన్‌‌ వెస్లీ
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ విమర్శ

జనగామ, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పాలన కార్పొరేట్లకు అనుకూలంగా సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌ వెస్లీ ఆరోపించారు. జనగామలోని సాయిరాం కన్వెన్షన్‌‌ హాల్‌‌లో సోమవారం జరిగిన ఏసిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనతో దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. కార్పొరేట్‌‌ శక్తులకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ.. ఓట్లేసి గెలిపించిన ప్రజలపై మాత్రం జీఎస్టీ పేరుతో పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాస్తున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. 

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. అంతకుముందు స్థానిక నెహ్రూ పార్క్‌‌ నుంచి సాయిరాం కన్వెన్షన్‌‌ హాల్‌‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్‌‌, బొట్ల శేఖర్, రాపర్తి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాశ్‌‌, బెల్లంకొండ వెంకటేశ్‌‌, బోడ నరేందర్, ఉపేందర్, భూక్య చందూనాయక్‌‌ పాల్గొన్నారు.