టీఆర్ఎస్​తో పొత్తు అప్పుడే ముగిసింది : తమ్మినేని వీరభద్రం

టీఆర్ఎస్​తో పొత్తు అప్పుడే ముగిసింది : తమ్మినేని వీరభద్రం

టీఆర్ఎస్​తో పొత్తు అప్పుడే ముగిసింది
వచ్చే ఎన్నికలప్పుడే మళ్లీ డిసైడ్ ​చేస్తం
పాలేరులో నా పోటీ ఊహాగానమే 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో టీఆర్ఎస్​తో ఎన్నికల పొత్తు మునుగోడు ఉప ఎన్నికతోనే ముగిసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఖమ్మం సుందరయ్య భవన్​ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరులో తాను పోటీ చేస్తానన్నది మీడియా ఊహాగానాలేనని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉండి పోటీ చేయడం తమ పార్టీ సంప్రదాయం కాదన్నారు. భవిష్యత్​ లో పొత్తులు, పోటీ అంశంపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.. మునుగోడులో బీజేపీ ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ భావజాలం, విష సంస్కృతి విస్తరించే ప్రమాదముందన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు లౌకికశక్తులు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు-, ప్రజలకు జరుగుతున్న నష్టాలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు.

పోడు భూముల విషయంలో చట్టప్రకారం సర్వే నిర్వహించాలన్నారు. ఎఫ్ఆర్సీలు, గిరిజన, రెవెన్యూ శాఖలను వదిలేసి, అటవీశాఖకు సర్వే బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. వలస ఆదివాసీలను నక్సల్స్ గా చిత్రీకరించడం తగదన్నారు. అర్హులందరికీ పట్టాలివ్వాలని కోరారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ఇలాగే నిర్వహిస్తే ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 40 ఏండ్లు పడుతుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్ పాల్గొన్నారు.