బీఆర్ఎస్‌కు సీపీఎం డెడ్​లైన్​

బీఆర్ఎస్‌కు సీపీఎం డెడ్​లైన్​
  •     ఈ నెలాఖరులోగా తేల్చాలని బీఆర్ఎస్‌కు సీపీఎం డెడ్​లైన్​
  •     ఇంకో వైపు కాంగ్రెస్​పార్టీ నేతలతోనూ చర్చలు ?
  •     ఇప్పటికే మిర్యాలగూడలో ప్రచారం మొదలుపెట్టిన జూలకంటి  
  •     ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణ

నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పొత్తులు ఎలా ఉన్నా.. తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది. ఈ నెలాఖరులోగా పొత్తుపై తేల్చాలని బీఆర్‌‌ఎస్‌కు డెడ్‌లైన్‌ పెట్టిన ఆ పార్టీ లీడర్లు.. ఎలాంటి నిర్ణయం రాకుండానే ప్రచారం మొదలు పెట్టారు.   మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఇప్పటికే ‘నాడు మిర్యాలగూడను అభివృద్ధి చేసింది మనమే..రేపు అభివృద్ధి చేసేది మనమే’  అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.  ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలతో గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  పోడు భూములు, అంగన్​వాడీ కార్యకర్తల సమస్యలు, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.  అంతేకాదు ఇందుకు సంబంధించిన అంశాలను ఆయన అనుచరులు ఎప్పటికప్పుడు సోషల్​మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.  

బీఆర్‌‌ఎస్‌తో పొత్తు ఉంటుందా..? 

బీఆర్ఎస్​తో పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో నకిరేకల్, నల్గొండ, మిర్యాలగూడ సీట్లను తమకు ఇవ్వాలని సీపీఎం నేతలు కోరుతున్నారు.  అయితే బీఆర్​ఎస్​హైకమాండ్​ మాత్రం పొత్తులు లేకుండా ఒంటిరిగానే పోటీ చేస్తామని చెబుతోంది. ఇటీవల మంత్రి కేటీఆర్​ ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొత్తు ఉండదనే క్లారిటీ ఇచ్చారు. కానీ, సీపీఎం మాత్రం పొత్తు పైనే గంపెడాశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 50 స్థానాల్లో పార్టీ బలంగా ఉందని, ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల మార్పిడి జరగాలంటే పొత్తుతోనే సాధ్యమవుతుందని పార్టీ నేతలు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్ పొత్తుతోనే గట్టెక్కిన సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.  ఈ నెలాఖరు నాటికి పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుందని, లేదంటే సీపీఐ, ప్రజా సంఘాలతో కలిసి పోటీకి సిద్ధమని ప్రకటిస్తున్నారు. 

పొత్తు కుదరకపోయినా..

బీఆర్​ఎస్​తో పొత్తు కుదరకపోతే బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోటీ చేస్తామని సీపీఎం నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్​ నేతలు కూడా టచ్‌లో ఉన్నారని, అక్కడ కూడా సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోతే తమ దారి చూసుకుంటామని అంటున్నారు.  ఒకవేళ బీఆర్ఎస్​తో పొత్తు కుదిరినా మిర్యాల గూడ సీటు ఇస్తారా..?  అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.  బీఆర్‌‌ఎస్‌ ముఖ్య నేతలు మిర్యాలగూడను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చిచెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలనే భావిస్తుండడంతో ఆయనకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.  పొత్తు కుదిరినా.. కుదరకపోయినా, ఈ క్వెషన్స్‌ ఎలా ఉన్నా  పోటీ చేయడం మాత్రం పక్కా.. అని జూలకంటి స్పష్టం చేస్తున్నారు.